
పాలిటెక్నిక్‌తో అపార ఉద్యోగావకాశాలు
ఎచ్చెర్ల క్యాంపస్: పదో తరగతి తర్వాత తక్కువ వయసులోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే పాలిటెక్నిక్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్‌చార్జి గురుగుబెల్లి దామోదర్‌రావు అన్నారు. కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హెచ్‌టీటీపీఎస్://ఏపీఎస్‌బీటీఈటీ.ఏపీ.ఐఎన్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో పది ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 300, మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120, సీతంపేట మోడల్ పాలిటెక్నిక్‌లో 120 సీట్లు ఉన్నాయని వివరించారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక ఉచితంగా కోచింగ్ ఇచ్చి స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు.