● బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంపై అలుదు గ్రామస్తుల నిరసన
● ఇరువైపులా నిలిచిపోయిన వాహనం
● పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం
సారవకోట : అలుదు గ్రామంలోని బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ శనివారం గ్రామస్తులు రహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్ సీపీ మండల కమిటీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ, కళ్యాణం శ్రీను ఆధ్వర్యంలో జాతీయ రహదారి 326–ఎపై నిరసన వ్యక్తం చేస్తూ ఇరువైపులా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సెంటర్‌లో సుమారు 40 ఏళ్లుగా ప్రధాన వీధికి సమీపంలోని బస్టాప్ వద్ద ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నిలుపుదల చేసి ప్రయాణికులను ఎక్కించుకునే వారు. ఇప్పుడు కేళవలస వెళ్లే జంక్షన్ వద్ద బస్సులు నిలుపుదల చేయడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న బస్సును బస్టాప్ వద్ద నిలుపుదల చేయాలని కోరినా ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డు పైకి చేరుకున్నారు. అదే బస్సు పాతపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సమయంలో బస్సుకు అడ్డగా నిల్చుని నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న బస్సులను సైతం ఆపేసి ఆందోళన కొనసాగించారు. డ్రైవర్లు, కండక్టర్లతో పాటు శ్రీకాకుళం డిపో మేనేజర్ దృష్టికి ఎన్నిసార్లు సమస్య తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న బస్టాప్ వద్ద కాకుండా గ్రామానికి సుమారు 800 మీటర్లు దూరంలో ఉన్న కేళవలస జంక్షన్ వద్ద బస్సులు నిలుపుదల చేయడంతో రాత్రి పూట ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా మహిళలు, పిల్లలతో బస్సు ఎక్కాలంటే అవస్థలు తప్పడం లేదని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు. కాగా, ట్రాఫిక్ స్తంభించిందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడి సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది. ఈ విషయమై సోమవారం జిల్లా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు స్థానికులు తెలిపారు.
కొన్ని సంవత్సరాలుగా సచివాలయం ఉన్న వీధిలో బస్సులు నిలుపుదల చేసేవారు. అక్కడ బస్టాప్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ కాకుండా కేళవలస జంక్షన్లో ఆపడంతో వృద్ధులు, పిల్లలతో వెళ్లేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం. బస్టాప్ వద్దే బస్సులు ఆపాలి.
– తర్ర హేమలత, అలుదు
ఎక్కడో ఊరి చివరనున్న కేళవలస జంక్షన్‌లో బస్సులు ఆపడంతో పిల్లలు, వృద్ధులతో వెళ్లేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం. బస్టాప్ నుంచి అర కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం వెళ్లిత కేళవలస జంక్షన్ వద్ద బస్సు ఎకాల్సి వస్తుంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించాలి.
– కళ్యాణం పార్వతి, అలుదు


