చట్టం ముందు అంతా సమానమే | Sakshi
Sakshi News home page

చట్టం ముందు అంతా సమానమే

Published Fri, Nov 10 2023 4:52 AM

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా   - Sakshi

జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: చట్టం ముందు పౌరులంతా సమానమేనని, పేదరికంతో న్యాయ సహాయం పొందలేని వారు న్యాయ సేవాధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులోని న్యాయ సేవ సదన్‌లో గురువారం నిర్వహించిన లీగల్‌ సర్వీసెస్‌ డేకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు న్యాయమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ సేవలు చాలా విలువైనవని, పరిష్కారమే దొరకదనుకున్న ఎన్నో సమస్యలు పరిష్కారమైన దాఖలాలు ఉన్నాయని వివరించారు. న్యాయ సేవలకే పరిమితం కాకుండా ఉచిత వైద్య క్యాంపులు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 53 మెగా లోక్‌ అదాలత్‌ లు నిర్వహించామని, 33,498 పెండింగ్‌ కేసులను పరిష్కరించామని పేర్కొన్నారు. జిల్లాలో 653 లీగల్‌ లిటరసీ క్యాంపులు నిర్వహించామని, 18 చోట్ల వైద్య శిబిరాలు, బ్రదర్‌ హుడ్‌, గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ లాంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు కె.శ్రీదేవి, పి.భాస్కరరావు, ఎస్‌.మహేంద్ర ఫణి కుమార్‌, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి అనురాధ, మేజిస్ట్రేట్‌ శ్రీవిద్య, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్ని సూర్యారావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఏఎస్పీ తిప్పే స్వామి, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ మెట్ట మల్లేశ్వర రావు, లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జ్ఞాన సువర్ణ రాజు, స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గేదెల వాసుదేవరావు, సాంఘిక సంస్కర్త మంత్రి వెంకటస్వామి ఎంపీ ఆర్‌ లా కాలేజీ ప్రిన్సిపల్‌ కే.మోషే తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement