అగళి: పొరుగు రాష్ట్రంలో పని ముగించుకొని ఇంటికి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కరిదాసనపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు వివరాల మేరకు.. ఐ.తోనసనపల్లి గ్రామానికి చెందిన రవి (49) ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్ర కళ్ళహళ్ళి గ్రామానికి స్వంత పనిపై వెళ్లాడు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా సాయంత్రం కరిదాసనపల్లి, చిగమతిగట్ట గ్రామాల మధ్యనున్న గంగమాలమ్మ పొలం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రవి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్య రాధ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రంగడు యాదవ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


