● వ్యక్తి మృతి
బత్తలపల్లి: అనంతపురం – కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని సంజీవపురం వద్ద ఆదివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దీపావళి పండుగ పర్వదినాన మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం దక్షిణామూర్తి కాలనీకి చెందిన బిల్లే నారాయణస్వామి(39) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. అనంతపురానికి చెందిన ఐచర్ వాహన యజమాని ఇలియాజ్‌బాషా సూచనల మేరకు సంజీవపురం వద్ద దానిమ్మ తోటలో పని చేస్తున్న కూలీలకు నారాయణస్వామి భోజనం అందజేశాడు. అనంతరం తన ద్విచక్ర వాహనంలో తిరిగి వెళ్తుండగా, సంజీవపురం వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్న కారు ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
12న జాబ్ మేళా
పెనుకొండ రూరల్: స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నాగ శశికళ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సుండి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బి.టెక్, ఎం.టెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు హాజరవ్వచన్నారు. మేళాలో ఎంపికై న వారికి రూ.13 వేల నుంచి 20 వేల దాకా వేతనం ఇస్తారని తెలియజేశారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు విద్యార్హత నకలు పత్రాలు, ఆధార్ కార్డు, రెండు పాస్ ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఓబుళంపల్లి ఎంపీటీసీ ఎన్నికపై ఫిర్యాదు
చెన్నేకొత్తపల్లి(కనగానపల్లి): చెన్నేకొత్తపల్లి మండలంలోని ఓబుళంపల్లి ఎంపీటీసీ ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డోలా ఆదిలక్ష్మమ్మ తెలిపారు. ఆదివారం చెన్నేకొత్తపల్లిలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఓబుళంపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన తాను ఐదు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మల్లమ్మపై గెలుపొందానన్నారు. కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఎన్నికల అధికారులు తమకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా బయటకు పంపివేసి, రీకౌంటింగ్ పేరుతో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థికే డిక్లరేషన్ ఫారం అందజేశారని వాపోయారు. దీనిపై జిల్లా కలెక్లర్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సహకారంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
లేపాక్షి: మండలంలోని మైదుగోళం పక్కన వున్న కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. సోమవారం విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి మహిళా మృతికి గల కారణాలను ఆరా తీశారు. మృతురాలు కర్ణాటకలోని నగరిగెరకు చెందిన భారతి(36) నిర్ధారించారు. ఈమె ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. విగతజీవిగా పడివున్న భారతిని చూసి భర్త ఉదయ్ కన్నీటి పర్యంతమయ్యాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
‘కాంగ్రెస్ బహిరంగ
క్షమాపణ చెప్పాలి’
పుట్టపర్తి టౌన్: హిందూ సమాజానికి కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ పార్టీ విభాగాల సహాయ సమన్వయకర్త విష్ణువర్ధన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక వైఖరిని లేవనెత్తడం సిగ్గుచేటన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీ హిందువులపై వివక్షపూరితమైన వైఖరిని అవలంబిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలపడానికి కూడా ఇష్టపడకపోవడం విచారకమన్నారు. హిందూ ధర్మం, ఆచార, సంప్రదాయాలను గౌరవించడం ప్రతి పార్టీ బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోకపోవడం కారణంగా, దేశ ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


