● కలెక్టర్ శ్యాం ప్రసాద్ వెల్లడి
ప్రశాంతి నిలయం: మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ ఈనెల 27న పోస్టల్ బ్యాలెట్లు అందజేస్తామని, ఉద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు సంబంధిత మున్సిపాలిటీల ద్వారా పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చన్నారు.
నిబంధనలు పక్కాగా పాటించాలి..
పెనుకొండ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటున్న ఉద్యోగులంతా తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ నిబంధలన్నీ పక్కాగా పాటించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పెనుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో సాగుతున్న ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఇప్పటివరకూ ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయంటూ ఎన్నికల అధికారులను ఆరా తీశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. అలాగే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం కల్పించాలని పోలీసులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ స్వాతి, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.
నెట్టికంటుడి సన్నిధిలో రణబాలి
గుంతకల్లు రూరల్: సినీ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రణబాలి సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ ఎం.విజయరాజు, అర్చక బృందం ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సినీ హీరోను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు.
కంప్యూటర్, ట్యాలీ కోర్సుల్లో ఉచిత శిక్షణ
అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు కంప్యూటర్, ట్యాలీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 45 రోజుల వ్యవధి ఉన్న కోర్సులో కస్టమర్ రిలేషన్‌షిప్ – సర్వీస్, కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ (జీఎస్టీ), స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్టైల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలియజేశారు. 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు అర్హులని చెప్పారు. వివరాలకు 77807 52418ను సంప్రదించవచ్చన్నారు.


