పుట్టపర్తి అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను వారంలోపు పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 14 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలికలకు హెచ్‌పీవీ టీకాలను వంద శాతం అందజేయాలన్నారు. సార్వజననీ టీకాల కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పారు. గర్భిణుల వివరాల నమోదు నుంచి సుఖ ప్రసవం, అనంతరం అందించే అన్ని సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో క్షయ వ్యాధి అనుమానితులను గుర్తించి గళ్ల పరీక్షలకు పంపాలని, వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందించాలన్నారు. అలానే ఎన్‌సీడీ, సీడీ సర్వేను పూర్తి చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చికిత్స అందజేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అనుపమ జేమ్స్, డాక్టర్ సునీల్, డాక్టర్ కిరణ్, డిప్యూటీ డెమో బాలసుబ్రమణ్యం, కళాధర్, వీరమ్మ, నాగరాజు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్
అనంతపురం: వినూత్న ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామిక రంగం – విద్యాసంస్థల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జేఎన్‌టీయూఏ వేదికగా శనివారం ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్ – 2026 కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మంగా తీసుకుంది. కార్యక్రమంలో పాల్గొనే విశిష్ట అతిథులు ఐఈఈఈ ఇండియా కంట్రీ హెడ్ శ్రీకాంత్ చంద్రశేఖర్, అసెంచర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపాల పింగళి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఏ చౌదరి తదితరులు శుక్రవారం సాయంత్రానికి జేఎన్‌టీయూఏకి చేరుకున్నారు. వీరికి వర్సిటీ వీసీ ఆచార్య సుదర్శనరావు ఘన స్వాగతం పలికారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కదిరి అర్బన్: మండల పరిధిలోని గట్ల సమీపం బత్తలపల్లికి వెళ్లే రోడ్డు వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డిని వివరణ కోరగా మృతి చెందిన వ్యక్తి కె.బ్రాహ్మణపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, అతడు అనారోగ్యంతో బాధపడుతుండే వాడని తెలిపారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. రాత్రి అయినా శవాన్ని పోస్టుమార్టంకు తరలించకపోవడంతో కుక్కులు మృతదేహం చుట్టూ తిరుగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


