ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ఖూనీ

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు అధికార పార్టీ కనుసన్నల్లో నడుచుకున్నారు. వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ జీ హుజూర్‌ అంటూ సాగిలపడ్డారు. పోలీసులు పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికే పాతరేసేలా ప్రవర్తించారు. జిల్లాలో గుత్తి, తాడిపత్రిలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మీ కాళ్లు మొక్కుతాం.. నామినేషన్లు వేసేందుకు సహకరించండి అని పోలీసులను వేడుకున్నా స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గుత్తి మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన అనుచరులను ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపైకి ఉసిగొల్పారు. పట్టణంలో ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనిపించారు. కత్తులు, రాడ్లు పట్టుకుని భయభ్రాంతులకు గురిచేశారు. 19వ వార్డు నుంచి భావమ్మ, 29వ వార్డు నుంచి రంగస్వామి నామినేషన్‌ వేసేందుకు వస్తే వారి చేతుల్లోని పత్రాలను బలవంతంగా లాక్కొని చింపేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అంజల నామినేషన్‌ వేసేందుకు ఉదయం 11.30 గంటలకు కేంద్రంలోపలికి వెళ్తే.. అధికారులు దాదాపు మూడు గంటల పాటు స్పందించలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, జిల్లా నాయకుడు మంజునాథ్‌రెడ్డి గుత్తికి వచ్చి కార్యకర్తలతో కలిసి నామినేషన్‌ సెంటర్‌ (మునిసిపల్‌ కార్యాలయం)కు బయలుదేరగా.. మార్గ మధ్యంలో పోలీసులు భారీగా వచ్చి అడ్డుకున్నారు. నామినేషన్‌ కేంద్రానికి వెళ్లడానికి వీల్లేదంటూ ఆటంకాలు సృష్టించారు. వారి తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలసి ర్యాలీగా బయలుదేరారు. నైరుతిరెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించుని స్టేషన్‌ వరకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పార్టీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో వెనక్కు తగ్గిన పోలీసులు వారిని వదిలిపెట్టారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా గాంధీ సర్కిల్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. నైరుతిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిగ్గు, మానం, ధైర్యం, దమ్ము ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆందోళనతో రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలోనే స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద వైఎస్సార్‌సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు షఫీపై టీడీపీ మూకలు దాడి చేసి గాయపరిచాయి. ఆ తర్వాత ఎట్టకేలకు అంజల నామినేషన్‌ పత్రాలను అధికారులు స్వీకరించారు.

ఎస్‌ఐ కాళ్లు పట్టుకున్నా...

మునిసిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సహకరించాలంటూ గుత్తి పట్టణానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు రంగస్వామి..ఎస్‌ఐ సురేష్‌ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. 29వ వార్డు ఎస్టీకి రిజర్వ్‌ అయిందని, తాను నామినేషన్‌ వేయడానికి వెళుతుంటే టీడీపీ నాయకులు పోలీసుల సమక్షంలోనే తన నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా నామినేషన్‌ వేయించాలని అభ్యర్థించారు. అయినా ఎస్‌ఐ గానీ, పోలీసులు గానీ స్పందించలేదు.

గుత్తిలో నామినేషన్ల ప్రక్రియకు

తూట్లు పొడిచిన ‘పచ్చ’ గూండాలు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులెవరూ

కేంద్రానికి రాకుండా అడ్డగింత

పోటీ చేస్తే చంపేస్తామంటూ

కత్తులు, రాడ్లతో బెదిరింపులు

నామినేషన్లు వేసేందుకు

సహకరించాలని పోలీసుల

కాళ్లు పట్టుకుని అభ్యర్థుల వేడుకోలు

తాడిపత్రిలోనూ అరాచకంగా

వ్యవహరించిన జేసీ అనుచరులు

జేసీ నేతృత్వంలో నామినేషన్‌ కేంద్రం దిగ్బంధం

తాడిపత్రి నామినేషన్‌ కేంద్రాన్ని ఆదివారం జేసీ ప్రభాకర్‌రెడ్డి ‘పచ్చ’ మూకలతో అష్టదిగ్బంధం చేశారు. వందలాది మందితో కాపలా పెట్టి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకుండా చేశారు. దీంతో 14, 32 , 33, 45, 11వ వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేయలేకపోయారు. ‘పచ్చ’ గుంపును తరిమివేయకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం గమనార్హం. ఇక కవరేజీకి వెళ్లిన ‘సాక్షి’ విలేకరులపైకి కూడా వందలాది మంది ‘పచ్చ’ మూకలు దూసుకొచ్చాయి. ఫొటోలు తీసినా, వీడియోలు తీసినా ‘పగిలిపోతాయ్‌’ అంటూ హెచ్చరించారు.

మిగిలిన కేంద్రాల్లో ప్రశాంతం

అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు గుంతకల్లు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలలో నామినేషన్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలోని 62 డివిజన్లకు గాను వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు.

కౌన్సిలర్‌ అభ్యర్థి ఇంటిపై దాడి..

తాడిపత్రిటౌన్‌: పట్టణంలో ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని పది మంది ‘పచ్చ’ గూండాలు ద్విచక్రవాహనాల్లో తిరుగుతూ దౌర్జన్యకాండ సాగించారు. 24వ వార్డు అభ్యర్థి కొట్ల షఫీ ఇంటిపై దాడి చేసి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఒకటో వార్డు అభ్యర్థి మహమ్మద్‌ జాఫర్‌ అలియాస్‌ చిట్టీ అన్న మాబ్బాషాను బండా మసీదు వద్ద బలవంతంగా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అలాగే కొంతమంది మహిళా అభ్యర్థులను, క్యాండెట్‌లను బలపరిచిన వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.

వైవీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు

గుత్తి/ గుత్తి రూరల్‌: గుత్తిలో చివరి రోజైన ఆదివారం వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను టీడీపీ గూండాలు చించివేసి వెనక్కు పంపుతున్నారని తెలిసి మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి గుంతకల్లు నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు గుత్తి మండలం నాగసముద్రం క్రాస్‌ వద్ద బారికేడ్లు, పోలీసు జీపులను అడ్డు పెట్టి మాజీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కారు దిగిన వెంకటరామిరెడ్డి గుత్తికి నడిచి వెళ్లేందుకు సిద్ధమవ్వగా పోలీసులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి కదలనీయలేదు. వాహనాల్లో కాకుండా బైక్‌పై ఒక్కడే వెళ్తానని కోరినా పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రోడ్డుపైనే ధర్నా చేశారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం..

చంద్రబాబు ప్రభుత్వ చేతగాని పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని తెలిసి.. టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతూ.. దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. దీనికి మూల్యం చెల్లించుకునే రోజు తప్పకుండా వస్తుందన్నారు. తమకూ సమయం వస్తుందని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తిరగబడి కూటమి నాయకులను రాళ్లతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

గుత్తిలో తారస్థాయికి రౌడీయిజం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement