పుట్టపర్తి టౌన్: జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగిసింది. ధర్మవరం, హిందూపురం, కదిరి, పుట్టపర్తి మునిసిపాలిటీలతో పాటు పెనుకొండ, మడకశిర నగర పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించారు. చైర్మన్ స్థానాలకు వైఎస్సార్సీపీ, టీడీపీ, ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి మొత్తం 94 నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే అన్ని పురపాలక సంఘాల్లో వార్డు స్థానాలకు మొత్తం 1,317 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజు అభ్యర్థులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో అన్ని నామినేషన్ కేంద్రాల్లో సందడి కనిపించింది. ధర్మవరం ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు..నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు పెంచారు. చివరిరోజు ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరిరోజు ఆదివారం నామినేషన్లు మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించారు. కాగా అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ సతీష్కుమార్ పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్త్ చేర్పాటు చేశారు. అయితే చివరి రోజు కావడంతో అభ్యర్థులు నో డ్యూస్ పత్రాల కోసం కార్యాలయాలకు పరుగులు తీశారు. నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులతో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించారు.
పార్టీలవారీగా నామినేషన్ల వివరాలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులుగా వివిధ పార్టీల నుంచి 94 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ 18, టీడీపీ 18, బీఎస్పీ 3, బీజేపీ 1, కాంగ్రెస్ 8, జనసేన 12, ఇతరులు 5, ఇండిపెండెంట్లు 29 కలిపి మొత్తం 94 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే ఆరు మున్సిపాలిటీల్లో 218 వార్డులకు గాను 1,317 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్ సీపీ 360, టీడీపీ 424, బీజేపీ 65, జనసేన 60, బీఎస్పీ 7, సీపీఐ 8, కాంగ్రెస్ 14, ఎన్సీపీ 2, ఇతరులు 15, ఇండిపెండెంట్లు 362 మొత్తం 1,317 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
చైర్మన్ స్థానాలకు 94, వార్డుల
స్థానాలకు 1,317 నామినేషన్లు
నో డ్యూస్ సర్టిఫికెట్ల కోసం పరుగులు


