సాక్షి పుట్టపర్తి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన నామినేషన్ల స్వీకరణ ఆదివారంతో ముగిసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలకు వార్డులతో పాటు చైర్మన్ సీట్లకు నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున ఉన్నపళంగా నామినేషన్ పత్రాలతో వచ్చి సమర్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా మార్గదర్శకాలను పాటించలేదు. మూడు పార్టీల నుంచి చైర్మన్ రేసులోకి వచ్చారు. దీంతో చైర్మన్ సీటు ఒక పార్టీకి ఎందుకు కేటాయించాలని ఆశావహులు నిట్టూరుస్తున్నారు. డమ్మీ సెట్ల పేరుతో నామినేషన్ దాఖలు చేసి పోటీలో నిలిచారు. పరిశీలన తర్వాత ఎంతమంది ఉంటారు.. చివరి రోజున ఎంతమంది ఉపసంహరించుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వైఎస్సార్సీపీ వర్సెస్ కూటమి పార్టీలు
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, మడకశిర మున్సిపాలిటీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పుట్టపర్తి, మడకశిర చైర్మన్ స్థానాలను జనసేనకు కేటాయించారు. కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం సీట్లను టీడీపీకి అప్పజెప్పారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఒంటరిగా పోరాటం చేస్తుండగా.. మూడు పార్టీల నాయకులు కలిసి బరిలోకి దిగారు. వార్డుల విభజనలోనూ కూటమి పొత్తుల విభేదాలు బహిర్గతమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది.
మున్సిపల్ చైర్మన్ స్థానం.. ఎవరిదో..?
టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య కొరవడిన సఖ్యత
పుట్టపర్తిలో బీజేపీ, టీడీపీ తరఫున
నామినేషన్లు
మడకశిరలోనూ ఇదే పరిస్థితి..
జనసేన నేతల అలక
కదిరి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించారు. నిన్నటి వరకు షేక్ సమీరాను అభ్యర్థిగా ప్రచారం చేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించే సమయానికి మరో మహిళ అర్షియాబాను తెరపైకి వచ్చి నామినేషన్ వేశారు. బీజేపీ తరఫున మరో మహిళ నాగేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కదిరిలో కూటమి పార్టీల పెద్దలకు రెబల్స్ తలనొప్పిగా మారారు. స్వతంత్ర అభ్యర్థులు 15 మంది ఉన్నారు.
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూటమి నాయకుల చర్చల్లో భాగంగా జనసేనకు అప్పజెప్పారు. నామినేషన్ చివరి రోజున జనసేన అభ్యర్థి నామినేషన్తో పాటు బీజేపీ నుంచి ఒకరు.. టీడీపీ నుంచి ఇద్దరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మూడు పార్టీల నుంచి నామినేషన్ దాఖలు కావడంతో పార్టీల పెద్దలు బుజ్జగించే పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరు ఉపసంహరించుకుంటారో.. ఎవరు బరిలో ఉంటారో తేలాల్సి ఉంది.
మడకశిరలో జనసేన తరఫున శ్రీనివాసులు, మరో ఏడుగురు నామినేషన్ దాఖలు చేశారు.కాగా, అభ్యర్థి మార్పు జరిగే అవకాశం ఉంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య తగాదాతో జనసేనకు చైర్మన్ సీటు వదిలేశారు. అయితే జనసేన తరఫున కూడా మాజీ ఎమ్మెల్సీ కొందరితో నామినేషన్లు వేయించారు. దీంతో ఎంఎస్ రాజు మద్దతు ఇచ్చిన అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.


