పోట్లమర్రి ఎల్లమ్మ ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

పోట్లమర్రి ఎల్లమ్మ ఆలయంలో చోరీ

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

బత్తలపల్లి: పోట్లమర్రి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన సమాచారం.. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తలుపులకు ఉన్న తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 40 తులాల వెండి కిరీటం, 50 తులాల రెండు వెండి నాగ పడగలు, 18 తులాల వెండి చైను, 20 తులాల వెండి రూపంలో ఉన్న అమ్మవారు, సుమారు రెండు కిలోల వెండి, 4 గ్రాముల బంగారు తాళిబొట్టు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం పూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు శ్రీనివాసులు వెళ్లగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్థిని ఆత్మహత్య

కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): మండలంలోని న్యామద్దల గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థిని ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి అరుణ, మంజునాథ్‌ దంపతుల కుమార్తె అమూల్య (19) అనంతపురంలో బీటెక్‌ చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేసుకొంటూ కాలక్షేపం చేస్తుండగా తల్లి చూచి మందలించింది. మనస్థాపానికి గురైన ఆమె వారి ఇంటి సమీపంలో గడ్డివాము దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

తాడిమర్రి: ఏకపాదంపల్లిలో ఆదివారం జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తలారి సాకే రామన్న (65) తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంలో ఎకరాలో వేరుశనగ, అర ఎకరాలో చీనీ చెట్లను సాగు చేశాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పంటకు నీరు పెట్టడానికి మోటర్‌ ఆన్‌ చేసి వేరుశనగ పంటలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌ స్తంభం నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు చెట్టు మీద లాగిన విద్యుత్‌ తీగ రైతు మీద పడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గంగమ్మతో పాటు వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తేనెటీగల దాడిలో

ఉపాధ్యాయుడి మృతి

బ్రహ్మసముద్రం : తేనెటీగల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వేపులపర్తి గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం క్రికెట్‌ టోర్నీ నిర్వహించారు. గ్రామానికి చెందిన దివ్యాంగ ఉపాధ్యాయుడు గణేష్‌ (34) క్రికెట్‌ మ్యాచ్‌ చూడటానికి ఇతరుల బైక్‌పై వెళ్లాడు. మ్యాచ్‌ సందడితో సమీపంలోని చింతచెట్టులో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి అక్కడున్న వారిపై దాడి చేశాయి. ఈక్రమంలో అక్కడున్న వారంతా తప్పించుకుని పారిపోయారు. అయితే గణేష్‌ అక్కడే ఉండిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన రాయదుర్గం, ఆ తర్వాత బళ్లారి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ఫలించకపోవడంతో అక్కడే మృతి చెందాడు. గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామంలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మృతుడికి భార్య నాగమణి, కుమారుడు విహాన్‌, 18 నెలల కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement