మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే కూటమి నేతలు ధర్మవరంలో దౌర్జన్యకాండకు దిగారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డగించి భౌతిక దాడులకు పాల్పడ్డారు. నామినేషన్ పత్రాలు చించివేసి అరాచకం చేశారు. టీడీపీ, బీజేపీ నేతలకు ఇతర ప్రాంతాల నుంచి రౌడీలు తోడుకావడంతో గూండాగిరికి అడ్డేలేకుండా పోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఈ ఘటనలో 22 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.
ధర్మవరం: రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి లేదు. ప్రజలను ఓటు అడిగేందుకు ధైర్యం చాలడం లేదు. అయినా మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో కూటమి నేతలు రౌడీయిజం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేసి ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీల నాయకులు దారుణాలకు తెగబడ్డారు. ధర్మవరంలో దౌర్జన్యకాండకు దిగారు. దశాబ్దకాలంగా ప్రశాంతంగా నిర్వహిస్తూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఈ సారి కూటమి పార్టీల నాయకులు అరాచకశక్తులుగా మారి రణరంగంగా మార్చి భయోత్పాతం సృష్టించారు. బీజేపీ నాయకుల వేషంలో అల్లరి మూకలు వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేశాయి. ఇటు టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నేతల నామినేషన్ ఫారాలు చించి దౌర్జన్యకాండకు నాంది పలికారు.
పక్కా ప్లాన్‌తో దాడులు..
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో, బీఎస్సార్ మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్ద నామినేషన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు కేంద్రాల వద్దకు చేరుకోగానే టీడీపీ నాయకులు కార్యాలయం నలుదిక్కులా వందల సంఖ్యలో గుమిగూడి కాపుకాశారు. తొలుత టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ అభ్యర్థి మాసపల్లి సాయికుమార్‌పై దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారు. ఈ క్రమంలో మరో కౌన్సిలర్ అభ్యర్థి పుష్పమణి బైక్ నుంచి కింద పడటంతో ఆమె తలకు గాయమైంది. ఆ తర్వాత పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారిపై ముప్పేట దాడికి యత్నించారు. కౌన్సిలర్ అభ్యర్థి సుబ్బరాయుడుపై నామినేషన్ కేంద్రం వద్దే టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. చేయి విరగ్గొట్టి..నామినేషన్ పత్రాలు చించేసి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ మహేష్ సిబ్బందితో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు అల్లరి మూకలు ఇష్టారాజ్యంగా బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదర గొట్టారు.
నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత..
బీఎస్సార్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మరో నామినేషన్ కేంద్రంలో నామినేషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు 18 మంది రావడంతో టీడీపీ నాయకులు భారీగా అక్కడికి చేరుకుని పక్కా ప్లాన్‌తో భయోత్పాతం సృష్టించారు. మాజీ వైస్‌చైర్మన్ ఎర్రగుంట భాగ్యలక్ష్మిని అటకాయించి మహిళ అని చూడకుండా నామినేషన్ పత్రాలను చించి పరారయ్యారు. ఈ తర్వాత వైఎస్సార్సీపీ అభ్యర్థులు బాలం గోపాల్, మేడాపురం వెంకటేశ్, గుండా ఈశ్వరయ్య తదితరులపై భౌతిక దాడులకు దిగుతూ పోలీసుల ఎదుటే నామినేషన్ పత్రాలను చించేశారు. మరో అభ్యర్థి తలారి నళిని అసభ్యంగా తాకుతూ అడ్డగించారు.
రాళ్లతో ముప్పేట దాడి..
వైఎస్సార్సీపీ అభ్యర్థులు టీడీపీ నాయకులను ప్రతిఘటించి పోలీసుల సాయంతో నామినేషన్ వేసేందుకు వెళ్తున్నారని తెలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరులు హరీష్‌తో పాటు పలువురు నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ మద్దతు దారులపై ముప్పేట దాడికి దిగారు. భయంతో వైఎస్సార్సీపీ నాయకులు ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నా... బయటకు లాక్కొని వచ్చి మరీ రాళ్లతోదాడి చేశారు. ఈదాడిలో మొత్తం 22 మంది గాయపడగా, వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో అప్రాశ్చెర్వు ఈశ్వరయ్య, ఆదినారాయణ, బగ్గిరి బయపరెడ్డి, బాలంగోపాల్, గుండా ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ సతీష్‌కుమార్ సంఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.
కేతిరెడ్డి వినూత్న నిరసన..
ధర్మవరంలో కూటమి పార్టీల నాయకుల దౌర్జన్యకాండపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించారు. అనంతరం వారిని వీల్చైర్లమీద కూర్చోబెట్టుకుని ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వర్షం భారీగా కురుస్తున్నా...వైఎస్సార్సీపీ శ్రేణులు, బాధితులు ధర్నా కొనసాగించారు.
మూల్యం చెల్లించుకుంటారు..
ఓటమి భయంతో వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి నాయకులు దౌర్జన్యం చేసి దాడులకు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో ఎన్నో ఎన్నికలు చూశామని, ఇలాంటి దుర్మార్గాలను ఎన్నడూ చూడలేదన్నారు. అనంతరం కూటమి నేతల దాడులను ఆధారాలతో సహా పోలీసు అధికారులకు చూపించి ఫిర్యాదు చేశారు. పోలీసులు శాంతిభద్రతలను అదుపు చేయాలని, లేని పక్షంలో కూటమి నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘నేడు మీరు వేసే విత్తనమే రేపు చెట్టవుతుంది’’ ఈ విషయం కూటమి నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.
ఓటమి భయంతో
‘కూటమి’ గూండాయిజం
నామినేషన్ల ప్రక్రియలో అరాచక పర్వం
వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా భౌతికదాడులు
నామినేషన్ ఫారాలు చించివేసిన వైనం
బీజేపీ, టీడీపీ నాయకులు
పోటాపోటీగా గూండాగిరి
రాళ్లు, భౌతిక దాడులతో
పట్టణంలో భయోత్పాతం
కూటమి నాయకుల దాడిలో
22 మందికిపైగా గాయాలు
ఎస్పీ రంగ ప్రవేశంతో సద్దుమణిగిన పరిస్థితి


