హిందూపురం(చిలమత్తూరు): రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై హత్యాయత్నం వెనుక మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆరోపించారు. నామినేషన్లు వేసేందుకు నాయకులతో కలిసి వెళ్తున్న ఎంపీని అంతమొందించడానికి టీడీపీ గూండాలు పన్నాగం పన్నడ్డం అమానవీయ చర్యగా అభివర్ణించారు. మంత్రి లోకేష్ వైఖరితో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని మండిపడ్డారు. పథకం ప్రకారమే పుంగనూరులో రాళ్లు, కట్టెలు సిద్ధం చేసుకొని ఎంపీపై దాడి దిగుతుంటే పోలీసులు చేష్టలు చూస్తుండడాన్ని తప్పుబట్టారు. దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్ చేసి వారి వెనుక ఉన్న వారి వివరాలు పోలీసులు బహిర్గతం చేయాలని కోరారు.


