పుట్టపర్తి అర్బన్/పుట్టపర్తి టౌన్: కూటమి పొత్తులో భాగంగా పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లతో పాటు బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. గురువారం సాయంత్రం వరకూ చైర్మన్ బరిలో తామంటే..తామంటూ నేతలంతా హడావుడి చేశారు. అయితే రాత్రి అనూహ్యంగా జనసేనకు కేటాయించడంతో ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. నామినేషన్ల తొలిరోజు వైఎస్సార్సీపీ నేతలంతా ఫుల్ జోష్‌లో ఉంటే టీడీపీ, బీజేపీ నేతలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.
జనరల్‌కు అంటూ లీకు..ఆ తర్వాత బీసీలకు
పుట్టపర్తి మున్సిపాలిటీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయిస్తున్నట్లు అధికార పార్టీ తొలుత లీకులిచ్చింది. దీంతో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులు తెగ హడావుడి చేశారు. ఆ తర్వాత చైర్మన్ స్థానం బీసీలకు రిజర్వ్ చేస్తూ గెజిట్ రావడంతో వారంతా పత్తాలేకుండా పోయారు. రిజర్వేషన్ ఖరారయ్యాక టీడీపీలోని బీసీ నాయకులు ఐదారుగురు తమదే టికెట్ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం హోరెత్తించారు. పొత్తులో భాగంగా చైర్మన్ సీటు జనసేనకు కేటాయించడంతో వారి ఆశలన్నీ నిరాశగా మారాయి. తామే చైర్మన్ అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకున్న టీడీపీ, బీజేపీ నేతలు ప్రజలకు ముఖం చూపించలేక ఇళ్లకు పరిమితమయ్యారు.
‘పల్లె’ వద్ద పంచాయితీ.. బరిలో నిలిచేలా ప్లాన్
చైర్మన్ స్థానం జనసేనకు కేటాయించడాన్ని జీర్ణించుకోని టీడీపీ నేతలు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డితో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేళ్ల నుంచి తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఇప్పటికే జనసేనకు కొత్తచెరువు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇచ్చారని, ఇపుడు మున్సిపల్ చైర్మన్ సీటు కూడా ఇవ్వడం అన్యాయమని వాపోయినట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి జనసేన కండువా వేసుకుని ఇంటింటి తిరిగి గ్లాసు గుర్తుకు ఓటేయాలని చెప్పడం తమ వల్ల కాదని తెగేసి చెప్పారు. జనసేన జెండామోసేదే లేదంటూ తేల్చిచెప్పారు. మరి కొంతమంది నాయకులు మాత్రం జనసేనలో చేరి చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సహకరించాలని నేరుగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితోనే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొంత మంది మాత్రం టీడీపీ నాయకులు ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేస్తామని తేల్చిచెప్పారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఫుల్ జోష్‌లో వైఎస్సార్ సీపీ..
రిజర్వేషన్లు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీ నేతలు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. నామినేషన్‌కు అవసరమైన నోడ్యూ, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలను తీసుకునేందుకు వారంతా మున్సిపల్ కార్యాలయం రాగా, అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎవరు ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారో ఇప్పటికే దాదాపుగా ఖరారు కాగా, అందరూ సమరోత్సాహంతో ఉన్నారు.
అభివృద్ధే ప్రచారాస్త్రంగా బరిలోకి..
వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి చేసిన అభివృద్ధే ప్రచార అస్త్రంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. పుట్టపర్తిని జిల్లాకేంద్రం చేయడం, జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు చెరువులకు నీరందించే పనులకు శ్రీకారం చుట్టడం ఇలా.. పలు అభివృద్ధి పనులు చేశారని, అలాగే అనేక సంక్షేమ పథకాల ద్వారా జనరంజక పాలన అందించారని..వాటినే ప్రజలకు చెప్పి ఓట్లు అభ్యర్థించేందుకు వారంతా సిద్ధమయ్యారు.
చైర్మన్ సీటును జనసేనకు
కేటాయించిన కూటమి
అసంతృప్తితో రగిలిపోతున్న
తెలుగు తమ్ముళ్లు
సహాయ నిరాకరణకు నిర్ణయం
ఇండిపెండెంట్‌గా
బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు


