అత్తార్‌ పర్వీన్‌కు అవకాశం | - | Sakshi
Sakshi News home page

అత్తార్‌ పర్వీన్‌కు అవకాశం

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

● చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా

ఎంపిక చేసిన వైఎస్సార్‌ సీపీ

● విలేకరుల సమావేశంలో ప్రకటించిన బీఎస్‌ మక్బూల్‌

కదిరి టౌన్‌: వైఎస్సార్‌ సీపీ కదిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా సతీమణి అత్తార్‌ పర్వీన్‌ను ఎంపిక చేసినట్లు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అత్తార్‌ పర్వీన్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్తార్‌ పర్వీన్‌ను చైర్‌పర్సన్‌ పీఠంపై కూర్చోబెట్టాలన్నారు. పొత్తులో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు కేటాయించామని, వారి విజయానికి కూడా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూలశ్రీనివాసరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు షేక్‌ బాబ్జాన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిబంధనలు కచ్చితంగా పాటించాలి

పుట్టపర్తి టౌన్‌: ఎన్నికల సంఘం నిబంధనలు అందరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం పుట్టపర్తి సమీపంలోని ఎనుముపల్లి బీసీ బాలుర వసతి గృహం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన అడ్మినిస్టేటివ్‌ కౌంటర్లు, హెల్ప్‌ డెస్క్‌లను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

హిందూపురం టౌన్‌: జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఎంజీఎం పాఠశాల, మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కౌంటర్లు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నామినేషన్‌ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల కేంద్రం నుంచి 100 మీటర్లలోపు ఎవరూ రాకూడదని, అభ్యర్థులను బెదిరించడం, కులాలు, మతాల వారీగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement