మడకశిర: ‘పొత్తు ధర్మం పాటించాలి...కానీ మనకే మేలు జరగాలి’ అన్నట్లుగా కూటమిలో సీట్ల కేటాయింపు సాగింది. పేరుకు మడకశిర చైర్మన్ సీటు జనసేనకు కేటాయించినా ..పోటీ చేసే అభ్యర్థులే గ్లాసు పార్టీలో లేరు. దీంతో టీడీపీ నేతలే జనసేనలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మడకశిర నగర పంచాయతీలో పలువురు టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
బలం లేదని తెలిసీ కేటాయింపు..
మడకశిర చైర్మన్ స్థానానికి టీడీపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాల నాయకులు పోటీపడ్డారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులకు చైర్మన్ సీటు కేటాయిస్తే ..మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో అసంతృప్తి వస్తుందని భావించిన టీడీపీ నేతలు... తెలివిగా మడకశిర నగర పంచాయతీని జనసేనకు కేటాయించే విధంగా పావులు కదిపినట్లు ప్రచారం సాగుతోంది.
పదవుల కోసం... ‘పచ్చ’ ప్రణాళిక..
కూటమి పొత్తులో భాగంగా మడకశిర నగర పంచాయతీ చైర్మన్ స్థానం జనసేనకు కేటాయించినా. పోటీ చేసేది టీడీపీ నాయకులేనని ప్రచారం సాగుతోంది. మడకశిర నగర పంచాయతీలో జనసేన తరుఫున పోటీ చేయడానికి ఎలాగూ అభ్యర్థులు ఉండరని, టీడీపీ నాయకులనే జనసేనలోకి పంపి పోటీ చేసే విధంగా ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ ప్లాన్లో భాగంగానే టీడీపీ హైకమాండ్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జనసేనలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీలోని పెద్దలు తమ్ముళ్లకు సూచించగా..పలువురు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
చైర్మన్ అభ్యర్థిపై ఉత్కంఠ..
మడకశిర నగర పంచాయతీని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థిపై ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జనసేనలో ఆ స్థాయి నాయకులు లేరని ఆ పార్టీ పెద్దలకే తెలుసు. అందుకే ఎవరైనా టీడీపీ నుంచి వస్తారా... అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలే పలువురు జనసేనలో చేరేందుకు సిద్ధం కాగా, రేసులో ఎవరు నిలుస్తారా అని జనం చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఓ టీడీపీ ముఖ్య నేత సోదరుడు టీడీపీ తరఫున చైర్మన్ స్థానానికి పోటీ చేయాలని భావించారు. దాదాపుగా అయనే చైర్మన్ అభ్యర్థిగా ఉంటారని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా జనసేనకు కేటాయించడంతో రాజకీయ సమీకరణలు మారాయి. ఈ క్రమంలో సదరు నాయకుడిని జనసేనలోకి పంపి ఆ పార్టీ తరఫున పోటీ చేయించాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. ఓ టీడీపీ నాయకుడి కుటుంబానికి చెందిన ఓ మహిళ జనసేన అభ్యర్థిగా పోటీలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందనన్న ప్రచారం సాగుతోంది.
జనసేనకు ప్రచారం చేయలేం
టీడీపీ అధిష్టానం నిర్ణయంతో టీడీపీలోని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుమని వందమంది కార్యకర్తలు లేని పార్టీకి చైర్మన్ స్థానం కేటాయించడంతో ఇప్పుడు తామంతా జనసేన కండువా వేసుకుని గ్లాసు గుర్తుకు ఓటు వేయమని ఎలా అభ్యర్థించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడినే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది తమ్ముళ్లు ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మడకశిరలో చైర్మన్ స్థానం
జనసేనకు కేటాయించిన కూటమి
రేసులో తమ్ముళ్లు...
కండువా మార్చేందుకు సిద్ధం
వార్డుల్లోనూ జనసేన తరఫున
పోటీకి పచ్చ నేతల ప్లాన్
జనసేనకు ప్రచారం చేయలేమని తేల్చేసిన టీడీపీ కార్యకర్తలు


