అనంతపురం కల్చరల్: సెంటిమెంటు అనేది రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్లకు కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఏ పనిచేయాలన్న సరే మంచి ముహూర్తం లేకుండా అడుగేయరు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేడి రాజుకోవడంతో మళ్లీ జ్యోతిష్యుల చుట్టూ అభ్యర్థులు ప్రదక్షిణ చేస్తున్నారు. మరో పదిహేనురోజుల్లో మునిసిపల్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనున్నా నామినేషన్ల ప్రక్రియ కీలకం కాబట్టి శుభముహూర్తాల వేట అప్పుడే మొదలైంది. ఉన్నది తక్కువ సమయమేనైనా ప్రచారమైనా..నామినేషన్లయినా ఏ సమయంలో ప్రారంభించాలి .. ముహూర్తం మంచిదా కాదా అని బేరీజు వేసుకుంటున్నారు. దీంతో జ్యోతిష్యులు, పురోహితులకు డిమాండ్ పెరిగిపోయింది.
మంచి ముహూర్తాలివే...
నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ముహూర్తం అంటే 16న షష్టి, శుక్రవారం మూలా నక్షత్రం కావడంతో బలమైందని జ్యోతిష్యులంటున్నారు. ఈనెల 18న ఆదివారం ఉత్తారాషాడ నక్షత్రం కూడా మరింత బలం చేకూరేలా చేస్తుంది. రాజ్యాధికారం దక్కే రవి శుభకరుడు కావడం కలిసొచ్చే అంశమని పురోహితులు చెబుతున్నారు. మధ్యలో వచ్చే 17 నిజంగానే మధ్యస్థంగానే ఉంటుందంటున్నారు.
మాకు కూడా అవసరమే ..
హేతువాదులు, నాస్తికులు, దేవుడిని, జాతకాలను నమ్మమని చెప్పుకునే కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు కూడా స్నేహితుల వద్ద ముహూర్తాల ప్రస్తావన తెస్తున్నారు. జిల్లాలో కమ్యూనిస్టు నాయకులు పోటీ చేస్తుండడంతో అభ్యర్థులు నేరుగా కాకుండా వారి చుట్టాలు లేదా కార్యకర్తలు జ్యోతిష్యులను సంప్రదించి ఎలాగైనా మంచి ముహూర్తం నాడు నామినేషన్లు వేయడానికి చూస్తున్నారని పురోహితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు.
నేడు మొదలు కానున్న
నామినేషన్ల ప్రక్రియ
ముహూర్తం కోసం జ్యోతిష్యులు, పురోహితుల వద్దకు అభ్యర్థుల క్యూ
ఎక్కువ మంది వస్తున్నారు
సాధారణంగా చిన్నపాటి కార్యక్రమాలు చేసినా పంచాంగం చూసే ముహూర్తం పెడతాం. ఎన్నిలంటే చాలా మంది జీవన్మరణ సమస్యగా చూస్తారు. ఎక్కువ మంది మా దగ్గరకొచ్చి నామినేషన్ల కోసం మంచి ముహూర్తాలను ఖరారు చేసుకుంటున్నారు. ఉన్న గడువు కూడా మూడురోజులే కాబట్టి ఉన్నంతలో నామనక్షత్రాల ఆధారంగా ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు.
– వాసుదేవరావు, జ్యోతిష్యుడు, రాప్తాడు


