ప్రశాంతి నిలయం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 11,35,917 మంది ఓటర్లు ఉన్నారని, గత స్పెషల్ రివిజన్ డ్రాఫ్ట్ రోల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పోస్టర్లను తొలగించాలని, ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, ప్రచారాల కోసం ఆయా మండలాల ఎంపీడీఓలు, కమిషనర్లతో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అభ్యర్థులు వారి ఖర్చులను కచ్చితంగా ఎక్స్పెండేచర్ కమిటీలను తెలియజేయాలన్నారు. ఎన్నికల సంఘం అనుమతించిన ఖర్చు కంటే అధికంగా చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎన్నికల ప్రచార సమయాలను కచ్చితంగా పాటించాలన్నారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితోపాటు ఇద్దరు మాత్రమే రావాలని, ప్రతిపాదించేటప్పుడు ఒక్కరు మాత్రమే రావాలన్నారు.
రాత్రి 10 తర్వాత మైకులొద్దు
లౌడ్స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే పని చేయాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయకూడదన్నారు. సున్నితమైన పోలింగ్ స్టేషన్ల వద్ద వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియా మానిటరింగ్ కమిటీలు కలెక్టరేట్తో పాటు మున్సిపల్ స్థాయిల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీఎఫ్ఓ చక్రపాణి పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలి
పుట్టపర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల చైర్మన్, వార్డు సభ్యుల నామినేషన్ల కోసం పుట్టపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్ర, శని, ఆదివారాల్లో (16 నుంచి 19వ తేదీ వరకూ) నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు
కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్


