సాక్షి, పుట్టపర్తి : మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పుట్టపర్తి, హిందూపురం, ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు మడకశిర, పెనుకొండ నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఎన్నికల బరిలో నిలిచేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఆశావహులు టికెట్ల కోసం నేతల చుట్టూ తిరుగుతుండగా.. నామినేషన్కు అవసరమైన ధ్రువపత్రాల సేకరణలోనూ నిమగ్నమయ్యారు. కాగా, కూటమిలో పొత్తులో భాగంగా మడకశిర, పుట్టపర్తి చైర్మన్ స్థానాలను జనసేనకు కేటాయించారు. అయితే ఏ పార్టీ ఎన్ని వార్డుల్లో పోటీ చేయాలనే లెక్క ఇంకా తేలలేదు.
నామినేషన్లకు ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండటంతో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ, పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు పోటీ చేయాలనుకునే ఆశావహులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కౌన్సిలర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పుట్టపర్తి, మడకశిర చైర్మన్ స్థానాలు జనసేనకు కేటాయించారు. బీజేపీకి ఒక్కచోట కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. కాగా, కౌన్సిలర్ సీట్ల సర్దుబాటు అంశంపై గురువారం రాత్రి దాకా కూటమి పార్టీల మధ్య వ్యవహారం కొలిక్కి రాలేదు. ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ ఎన్ని వార్డుల్లో పోటీ చేయాలి? ఏయే వార్డులను ఏ పార్టీకి కేటాయించాలి? అనే అంశాలపై స్పష్టత కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో తమకు అనుకూలమైన స్థానాలను దక్కించుకునేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి వార్డులోనూ గెలుపు అవకాశాలు, స్థానికంగా ఉన్న బలాబలాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండటంతో ఎంపిక ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది. పొత్తులపై తుది స్పష్టత రాకపోవడంతో టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల బరిలో నిలపాల్సిఠి అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. టికెట్ ఆశిస్తున్న వారు తమకు అవకాశం కల్పించాలని పార్టీ ముఖ్య నాయకులను కలుస్తున్నారు. కొందరు తమకు ఉన్న స్థానిక మద్దతును వివరించి టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా.. మరికొందరు పార్టీ పెద్దల నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
ఆశావహుల ఎదురుచూపులు
నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 18వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థుల్లో హైరానా నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ, నగర పంచాయతీలతో కలిసి మొత్తం 218 వార్డులు ఉన్నాయి. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీల నుంచే కాగా ఇతర పార్టీల నుంచి ఒక వార్డుకు 5 మంది వరకు ఆశావహులు సీట్ల కోసం పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలను అటుంచితే ఎక్కువమే మంది పోటీల్లో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నవారు సమయానికి అవసరమైన పత్రాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా ‘నో డ్యూ’ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు తదితర అవసరమైన ధ్రువపత్రాల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ వస్తుందన్న నమ్మకంతో ముందుగానే పత్రాలు సిద్ధం చేసుకున్న వారు కొందరైతే.. పార్టీ నిర్ణయం వెలువడిన తర్వాతే తుది అడుగు వేయాలని మరికొందరు భావిస్తున్నారు.
‘పుర’ పోరుకు
సర్వం సమాయత్తం
18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు
పుట్టపర్తి, మడకశిర చైర్మన్ సీట్లను జనసేనకు కేటాయించిన కూటమి
వార్డుల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట సాగిస్తున్న పార్టీలు
మూడు రోజులే గడువు.. ఆశావహుల్లో హైరానా
నో డ్యూ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం అభ్యర్థుల పరుగులు


