పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

పుట్టపర్తి టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో అడుగు ముందుకు పడింది. పల్లె పోరుకు నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో సర్పంచ్‌లు, పంచాయతీ వార్డులకు రిజర్వేన్లు ఖరారు చేస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 467 సర్పంచ్‌ స్థానాలుండగా, అందులో ఎస్టీ మహిళ 9, ఎస్టీ జనరల్‌ 22, ఎస్సీ మహిళ 29, ఎస్సీ జనరల్‌ 42, బీసీ మహిళ 60, బీసీ జనరల్‌ 65, అన్‌ రిజర్వ్‌డ్‌ మహిళ 129, అన్‌ రిజర్వ్‌డ్‌ జనరల్‌ 111 పంచాయతీలు కేటాయించారు. మొత్తం సీట్లలో మహిళలకు 227 పంచాయతీలు రిజర్వ్‌ చేశారు.

వార్డుల రిజర్వేషన్లు ఇలా...

జిల్లాలోని 467 పంచాయతీల్లో 4,912 వార్డులుండగా... ఎస్టీ మహిళ 146, ఎస్టీ జనరల్‌ 203, ఎస్సీ మహిళ 302, ఎస్సీ జనరల్‌ 454, బీసీ మహిళ 680, బీసీ జనరల్‌ 753, ఆన్‌రిజర్వ్‌డ్‌ మహిళ 1,330, అన్‌రిజర్వ్‌డ్‌ జనరల్‌కు 1,044 వార్డులు రిజర్వ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నియమావళి పక్కాగా అమలు చేయాలి: ఎస్పీ

ధర్మవరం అర్బన్‌: ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. గురువారం పట్టణంలోని నామినేషన్ల కేంద్రాలైన మున్సిపల్‌ కార్యాలయం, బీఎస్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలను ఎస్పీ సతీష్‌కుమార్‌ సందర్శించారు. నామినేషన్ల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూం, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో భద్రతా చర్యలు, అభ్యర్థులు, ఇతరుల రాకపోకల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య, ఆర్డీఓ రామభూపాల్‌రెడ్డి, డీఎస్పీ జగన్నాథ్‌రాజుతో చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా పోలీసు, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వన్‌ టౌన్‌ సీఐ రెడ్డెప్పకు సూచించారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలన

పెనుకొండ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఎస్పీ సతీష్‌కుమార్‌ గురువారం పెనుకొండ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, రిసెప్షన్‌, ఎన్నికల సామగ్రి భద్రత, సిబ్బంది రాకపోకలు, కౌటింగ్‌ సమయంలో చేపట్టాల్సిన భద్రతపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై, ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు, అల్లర్లు గొడవలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్‌ శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ వెంట సీఐ శేఖర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement