వీఆర్‌ఏల వేదన.. అరణ్య రోదన | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల వేదన.. అరణ్య రోదన

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

ప్రశాంతి నిలయం/పెనుకొండ రూరల్‌: రెవెన్యూ సమస్యల పరిష్కారం, సేవలందించడంలో గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏల)ది కీలక పాత్ర. గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమాచారాన్ని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో వీరి పాత్రే ముఖ్యం. వరదలొచ్చినా.. కరువులొచ్చినా సమాచారం అందించాల్సింది మాత్రం గ్రామ రెవెన్యూ సహాయకులే. ప్రభుత్వ వ్యవస్థలో ఎంతో కీలకమైన వీఆర్‌ఏల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తానని హామీనిచ్చారు. అలానే యువగళం పాదయాత్రలో మంత్రి లోకేశ్‌ వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో 764 మంది వీఆర్‌ఏలు పనిచేస్తుండగా మరో 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆవేదనతో సహాయ నిరాకరణ నిరసనలు..

కనికరించని కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పలుమార్లు సీఎం చంద్రబాబు నాయుడు, రెవెన్యూ మంత్రులను కలిసిన వీఆర్‌ఏలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్‌ 16 నుంచి సమ్మెకు దిగారు. మండల కేంద్రాలలోని తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద వీఆర్‌ఏలు రిలే దీక్షలు మూడో వారానికి చేరుకున్నా.. ప్రభుత్వం కనికరించకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేశ్‌లు వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని వాపోయారు. ఆందోళన బాట పట్టిన తమ సమస్యలు వినేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.

దీక్షల్లో వీఆర్‌ఏలు.. అవస్థల్లో ప్రజలు

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వీఆర్‌ఏలు నిరసన కార్యక్రమాలలో భాగంగా రిలేదీక్షలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 764 మంది వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తుండగా మరో 570 వరకు ఖాళీలు ఉన్నాయి. వీఆర్‌ఏల సహాయ నిరాకరణతో రెవెన్యూ సేవలు స్తంభించాయి. క్షేత్రస్థాయిలు పలు సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భూ విచారణలు, వివిధ రకాల ధృవీకరణ పత్రాల జారీ, భూ రీ–సర్వే, రికార్డుల పరిశీలన, పంటల నమోదు తదితర పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సర్‌ ప్రక్రియ సైతం వీఆర్‌ఏలు అందుబాటులో లేకపోవడంతో నత్తనడకన సాగుతోంది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ వీఆర్‌ఏల సహాయ నిరాకరణపై స్పందించకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు సమస్యలు ఎదుర్కోవాలోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డిమాండ్లు నెరవేర్చాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకుల ఆందోళన బాట

మూడు వారాలుగా సమ్మె చేసున్నా

స్పందించని ప్రభుత్వం

ఎన్నికల ముందు సమస్యలు

పరిష్కరిస్తామంటూ బాబు, లోకేశ్‌ హామీ

అధికారంలోకి వచ్చాక వీఆర్‌ఏలను కనీసం చర్చలకు పిలవని వైనం

మా కడుపు కాలడంతోనే ఉద్యమ బాట పట్టామంటున్న వీఆర్‌ఏలు

వీఆర్‌ఏలు అందరికీ తెలంగాణ తరహాలో పేస్కేల్‌ అమలు

నామినీలుగా పనిచేస్తున్న అందరినీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ వీఆర్‌ఏలుగా నియామకం

అర్హులైన వీఆర్‌ఏలకు 70 శాతం ప్రమోషన్ల కల్పన

మరణించిన వీఆర్‌ఏ కుటుంబంలో ఒకరికి కారుణ్య ఉద్యోగం

నైట్‌ వాచ్‌మెన్‌, అటెండర్‌, డ్రైవర్‌ పోస్టుల ప్రమోషన్లలో 20 శాతం ఉన్న కోటాను 70 శాతానికి పెంపు

వీఆర్‌ఏల

ప్రధాన

డిమాండ్లు

ఇవీ..

స్పందించకుంటే చలో విజయవాడ

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మూడు వారాలుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్‌లు మా సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు వారిని కలిసి అభ్యర్థించినా నేటికీ ఒక్కటీ నెరవేరకపోవడంతో ఉద్యమబాట పట్టాం. ప్రభుత్వం మా సమస్యలపై సానుకూలంగా స్పందించకుంటే చలో విజయవాడతో మా సత్తాచాటుతాం.

– ఎన్‌.పెద్దన్న, రాష్ట్ర అధ్యక్షుడు, వీఆర్‌ఏ సంఘాల జేఏసీ

30 ఏళ్లుగా ఇదే పని

వీఆర్‌ఏగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నా, ఎటువంటి ఆర్థిక భద్రత, భరోసా లేదు. చాలీచాలని జీతంతో జీవితాలను నెట్టుకొస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాలానుగుణంగా నిత్యవసర ధరలు పెరిగాయి. ప్రభుత్వం జీతం మాత్రం పెంచడం లేదు. ఏళ్లు పనిచేసినా కుటుంబానికి ఉద్యోగ భద్రత లేదు. మా డిమాండ్లు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు.

– అంజినప్ప, వీఆర్‌ఏ, అడదాకులపల్లి

వెట్టిచాకిరీ చేస్తున్నాం

ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. ఏళ్లుగా చాలీచాలని జీతాలు ఇస్తున్నా అధికారులు చెప్పిన ప్రతి పని చేస్తున్నాం. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మా కడుపుకాలి ఉద్యమం చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభు త్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. రూ.10,500 జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నాము. ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి.

– పెద్దన్న, జిల్లా అధ్యక్షుడు, వీఆర్‌ఏల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement