సాక్షి, పుట్టపర్తి
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు...బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించారు. రిజర్వేషన్ పాటిస్తూనే జనరల్ స్థానాల్లోనూ బీసీలను నిలబెట్టి గెలిపించారు. దీంతో బీసీలంతా వైఎస్సార్‌సీపీకి దగ్గర కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు రిజర్వేషన్ నాటకానికి తెరతీశారు. గత ఎన్నికల సమయంలో బీసీ వర్గాల ఓట్లు రాబట్టాలనే ఉద్దేశంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తెస్తానని ఊరూరా హామీలు గుప్పించారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత జీఓ మాత్రం ఇచ్చారు. రెండేళ్లు దాటినా చట్టం మాత్రం చేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ ప్రచారం హోరెత్తించారు. ఎవరు హైకోర్టును ఆశ్రయించినా రిజర్వేషన్ చెల్లదంటూ తీర్పు వస్తుందని తెలిసి కావాలనే అబద్ధాలు వల్లించారు. ఇప్పుడు ఆయన ఊహించిన తీర్పే రావడంతో లోలోన ఆనందపడుతూనే... బీసీల నేతల వద్ద మొసలి కన్నీరుకారుస్తున్నారు.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే అంశంపై న్యాయపరమైన వివాదాలు, గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ అదే అంశంపై మరోసారి చంద్రబాబు జీఓ వల్ల బీసీలను గందరగోళంలోకి నెట్టారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ చట్టబద్ధం చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇంతలోనే జీఓలను కోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు డ్రామా బయట పడిందంటూ బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ వర్గాలకు పెద్దపీట వేశారు. రిజర్వేషన్లు ఉన్నా.. లేకున్నా 50 శాతంపైగా సీట్లు ఇచ్చి న్యాయం చేశారు. రిజర్వేషన్ 50 శాతం దాటుతుందని కోర్టు తీర్పు ఇవ్వగా...ఓపెన్ కేటగిరీలోనూ బీసీలకు అవకాశాలు కల్పించి గెలిపించారు. పాలనలో భాగస్వామ్యం చేసి రాజకీయంగానూ ప్రాధాన్యం కల్పించారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు అన్ని రకాల పదవుల్లో అంచనాలకు మించి న్యాయం జరిగింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ లకు అడుగడుగునా అవమానమే ఎదురవుతోంది.
నమ్మించడం... వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ఇన్నాళ్లూ రిజర్వేషన్లతో బీసీలను ఊరించిన ఆయన..తాజాగా హైకోర్టు తీర్పు అంటూ సరికొత్త ఎన్నికల నాటకానికి తెరతీశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 34 రిజర్వేషన్లు ఇస్తూ చంద్రబాబు సర్కార్ ఇచ్చిన జీఓ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదంతా ముందే ఊహించిన చంద్రబాబు.. హమ్మయ్యా టికెట్లన్నీ తమవాళ్లకే ఇచ్చుకోవచ్చని లోలోన సంబరపడుతుండగా... ‘పచ్చ’
డ్రామాపై బీసీలంతా భగ్గుమంటున్నారు.
జనరల్‌లోనూ బీసీలకే పట్టం..
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ రిజర్వేషన్ రాగా, బోయ సామాజిక వర్గానికి చెందిన తుంగా ఓబుళపతిని నిలబెట్టి గెలిపించారు.
పుట్టపర్తి జెడ్పీటీసీ స్థానం జనరల్ కాగా, బీసీవర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ‘పుడా’ చైర్‌పర్సన్‌గానూ ఆమెకు అవకాశం కల్పించి బీసీలపై ఉన్న ప్రేమను చాటారు.
పెనుకొండలో బోయ సామాజిక వర్గానికి చెందిన మంగమ్మను ఎమ్మెల్సీ చేసి గౌరవించారు.
హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్‌కు రిజర్వ్‌కాగా, బోయ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రజను పీఠంపై కూర్చోబెట్టి గౌరవించారు.
కనగానపల్లి జెడ్పీటీసీ స్థానం గత రెండు పర్యాయాలూ జనరల్‌కే రిజర్వు అయినప్పటికీ ఆ స్థానం నుంచి కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరయ్య, మారుతిలకు అవకాశం కల్పించి గెలిపించారు.
బత్తలపల్లి జెడ్పీటీసీ స్థానం జనరల్ అయినా కురుబ సామాజిక వర్గానికి చెందిన కోటి సుధకు అవకాశం కల్పించారు.
...ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ పరంగా బీసీలకు వైఎస్ జగన్ ఎంతో మేలు చేశారు. గ్రామ సర్పంచ్‌లు మరెందరికో అవకాశం కల్పించి పాలనలో భాగం చేశారు. అందుకే నేడు బీసీలంతా వైఎస్సార్‌సీపీ బీసీల పార్టీ అంటూ అండగా నిలుస్తున్నారు.
34 శాతం రిజర్వేషన్ పేరుతో
‘పచ్చ డ్రామా’
జీఓ మాత్రం ఇచ్చి
చట్టం చేయని చంద్రబాబు
ఎవరు కోర్టుకు వెళ్లినా
కొట్టివేస్తారని తెలిసీ నాటకం
తాజాగా బీసీలకు 34 శాతం
రిజర్వేషన్ చెల్లదని హైకోర్టు తీర్పు
కేసు వీగిపోతుందని తెలిసీ మొసలి కన్నీరు
చంద్రబాబు తీరుపై మండిపడుతున్న బీసీ వర్గాలు
జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని గుర్తుచేసుకుంటున్న వైనం
బీసీలకు జగన్ సర్కారు పెద్దపీట..
ఓట్ల కోసమే కపట నాటకం..
ఓట్ల కోసమే బీసీ రిజర్వేషన్
బీసీ వర్గాల ఓట్లు కోసమే చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు హైకోర్టు రిజర్వేషన్ చెల్లదని చెప్పడంతో నా తప్పేమీ లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ 50 శాతం దాటింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపి రిజర్వేషన్లు తేవొచ్చు. కానీ చంద్రబాబు ఉద్దేశం అది కాదు. ఆయన దుర్మార్గాన్ని ఇప్పటికై నా బీసీలు తెలుసుకుని బుద్ధి చెప్పాలి.
– పొగాకు రామచంద్ర, పెనుకొండ


