‘బోరు’మన్నా.. నీరుపారదు | - | Sakshi
Sakshi News home page

‘బోరు’మన్నా.. నీరుపారదు

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

ఈ రైతు పేరు సల్లాపురం బాలరమణారెడ్డి, తాడిమర్రి మండలం కనుకుట్ల గ్రామం. తనకున్న 10 ఎకరాల్లో దాదాపు 1,500 చీనీ చెట్లను సాగు చేస్తున్నాడు. నీటి సౌకర్యం కోసం నాలుగు బోర్లు వేశాడు. సరిగ్గా పంట చేతికొచ్చే సరికి నాలుగుబోర్లూ ఒట్టిపోయాయి. దీంతో కొత్తగా మూడు బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు చీనీచెట్లు ఎండిపోతుండటంతో ఈసారి 750 అడుగుల మేర బోరు వేయించగా..కేవలం 2 ఇంచుల నీరు పడింది. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చయ్యింది. కొత్త బోరులో వస్తున్న నీరు 1,500 చెట్లకు చాలకపోవడంతో 15 ఏళ్ల క్రితం నాటిన 500 చెట్లను వదిలేసి మిగతా 1,000 చెట్లకు నీరు పెడుతూ వస్తున్నాను. ఆ బోరు కూడా ఎప్పుడు ఎత్తిపోతుందో తెలియడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

...తాడిమర్రి మండంలో భూగర్భజలమట్టం దారుణంగా పడిపోవడంతో బోర్లన్నీ ఒట్టిపోయాయి. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసి సాగుచేసిన చీనీ చెట్లు ఎండిపోతుండగా రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

తాడిమర్రి: మండలంలో రైతులు ఎక్కువగా ఉద్యానపంటలైన చీనీ, మామిడి, సపోటా, అరటి, దానిమ్మ తదితర తోటల సాగు చేస్తున్నారు. ఇక్కడ పండే చీనీకి ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఏటికేడు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం దాదాపు 8,292 ఎకరాల్లో చీనీతోటలు విస్తరించాయి. చీనీచెట్టు నాటిన దగ్గర నుంచి కాతకు వచ్చేందుకు కనీసం ఐదేళ్లు పడుతుంది. ఇలా ఐదేళ్లు కంటిపాపలా కాపాడుకున్న చెట్లన్నీ ఇప్పుడు ఎండుముఖం పట్టాయి. ప్రకృతి ప్రకోపం...పాలకుల ముందుచూపులేని తనంతో సాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఇప్పటికే ఉన్న బోర్లు దిష్టిబొమ్మల్లా మారగా...రూ.లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడని పరిసిత్థి నెలకొంది. దీంతో కొందరు రైతులు రోజూ ట్యాంకర్ల ద్వారా చీనీచెట్లకు నీటిని వదులుతూ చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ ఖర్మ ఇంతేననుకుని చెట్లను వదిలేశారు. వాస్తవానికి ఏటా ఆగస్టులోనే హెచ్‌ఎల్‌సీ ద్వారా 2 టీఎంసీల నీటిని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు విడుదల చేసేవారు. దీంతో బోర్లలో నీటి మట్టం పెరిగేది. ఈ ఏడాది అక్టోబర్‌ వచ్చినా హెచ్‌ఎల్‌సీ నీటిని విడుదల చేయకపోవడంతో గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో కొన్ని బోరు బావులు పూర్తిగా ఎండిపోగా, మరి కొన్ని బోర్లలో నీటి మట్టం తగ్గి అరకొరగా వస్తున్నాయి. దీంతో చీని చెట్లను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయి.

బోర్లు ఒట్టిపోగా...

ఎండిపోతున్న చీనీచెట్లు

ట్యాంకర్లతో నీటి తడులు

అందిస్తున్న రైతులు

కొత్త బోర్లు వేసినా ఫలితం శూన్యం...

సీబీఆర్‌కు నీరివ్వాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement