చిలమత్తూరు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చెరువులు, కుంటల్లో మట్టి దోచేస్తున్న మాఫియా, ప్రభుత్వ భూములనూ వదలడం లేదు. ఏపీఐఐసీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు.
పట్టా భూములుగా చిత్రీకరించి...
మండల పరిధిలోని కోడూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 333ను ఏపీఐఐసీ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది. ఆ భూములన్నీ ఏపీఐఐసీ పరిధిలోకి వెళ్లిపోయాయి. అయితే మదిరేపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ప్రైవేటు వ్యక్తులు వెంచర్‌ను అభివృద్ధి పరుస్తున్నారు. లెవెలింగ్ కోసం మట్టి అవసరం కాగా, స్థానికంగా ఉండే కొందరి ద్వారా మట్టి తరలించుకునేందుకు ఒప్పందం చేసుకొని ఏపీఐఐసీ భూమిలో నుంచి జేసీబీల ద్వారా ట్రాక్టర్లతో మట్టిని వారం రోజులుగా అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికే భారీ గుంతలు ఏర్పడగా, ఎవరైనా ప్రశ్నిస్తే మా భూముల్లోని మట్టినే తవ్వుకుంటున్నామని సమాధానం చెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు.
భారీగా బ్లాస్టింగ్..
భూములు చదును చేసుకునే క్రమంలో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలాల్లోని పెద్ద రాళ్లను, గుట్టలను పేలుడు పదార్థాలు వినియోగించి భారీ బ్లాస్టింగ్‌లు చేశారు. రోడ్డు పక్కనే ఉన్నా, సమీపంలోనే గ్రామం ఉన్నా ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మామూళ్ల మత్తులో యంత్రాంగం..
రియల్టర్లు, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీఐఐసీ భూముల్లో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులకు భారీగానే ముడుపులు చేరాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఐఐసీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉంటూ రియల్టర్ల అక్రమాలకు వంత పాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదే విషయంపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కుమార్‌ను వివరణ కోరగా పోలీసు స్టేషన్‌లో కేసు పెడతామని తెలిపారు. అయితే ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మైనింగ్ శాఖ తనిఖీలు చేయాల్సి ఉన్నా అక్రమార్కులకే సహకారం అందిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి.
ఏపీఐఐసీ భూముల్లో
పలువురి బరితెగింపు
మూమూళ్ల మత్తులో ఏపీఐఐసీ,
మైనింగ్, రెవెన్యూ యంత్రాంగం


