హిందూపురం టౌన్: యువత ఆరోగ్యకర అలవాట్లతో మెలగాలని హిందూపురం సబ్ డివిజన్ ఏఎస్పీ మహేష్, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ అనుమప జేమ్స్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 5 కిలోమీటర్ల మారథాన్ రెడ్ రన్ కార్యక్రమాన్ని చేపట్టగా, ఏఎస్పీ మహేష్ జెండా ఊపీ ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం వారు మాట్లాడుతూ యువతలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులు, కౌమార ఆరోగ్యం, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఈ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో జీవించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువతే దేశానికి వెన్నెముక లాంటివారని, యువత క్రమశిక్షణ కలిగి ఉండి, సామాజిక బాధ్యతతో మెలగాలని కోరారు. హెచ్‌ఐవీ సంక్రమించే మార్గాల పట్ల అవగాహన కలిగి ఉండి, యువత వాటి నియంత్రణకు పాటుపడాలని తెలిపారు. అనంతరం మారథాన్‌లో పురుషుల విభాగంలో హర్షద్, శ్రీనివాస్‌బాబులు మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. అలాగే మహిళా విభాగంలో మేఘన మొదటి స్థానంలో నిలిచింది. వీరికి మున్సిపల్ కార్యాలయంలో నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించారు. అలాగే విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ వెంకటరత్నం, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ క్రాంతి కుమార్, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, పీడీలు లోక్‌నాథ్, విలియమ్స్, సురేష్, మొరార్జీ యాదవ్, ఎస్‌డీజీఎస్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్పీ మహేష్


