నల్లచెరువు: స్థానిక గీతామందిరంలోని వేణుగోపాల స్వామికి పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు దాదెం శివారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సినీ నటి బిందు మాధవి పాల్గొన్నారు. బిందు మాధవితో పాటు ఆమె తల్లిదండ్రులు పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ దేవరింటి భాస్కర్‌రెడ్డి, నిర్మలకు ఆలయ అర్చకులు పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పీజీ నీట్‌లో గ్రీష్మరెడ్డికి 2,021వ ర్యాంకు
కదిరి అర్బన్: ఆల్ ఇండియా పీజీ నీట్ ఫలితాల్లో కదిరికి చెందిన డాక్టర్ కోనపల్లి గ్రీష్మరెడ్డి 2021వ ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రీష్మ తండ్రి రఘునాథ రెడ్డి కదిరి మండలం కేఎన్ పాళెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. తల్లి సుజనీ గృహిణి.
ఘనంగా ‘కళాజ్యోతి’
శత వార్షికోత్సవం
ధర్మవరం రూరల్: సాహిత్యం, కళలు, సంగీతం, నాటకం, నృత్యం, క్రీడలకు వేదికగా నిలిచిన ఈసీఆర్‌ఆర్ సరస్వతి నిలయం–కళాజ్యోతి సంస్థ శత వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1926లో ఎడ్వర్డ్ అనే ఆంగ్లేయ అధికారి చిన్న రీడింగ్ రూమ్‌గా ప్రారంభించిన ఈ సంస్థ అనంతరం గ్రంథాలయంగా రూపుదిద్దుకుని వేలాది పుస్తకాలు, దినపత్రికలు, వార, మాస పత్రికలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. చదరంగం, టెన్నిస్, షటిల్ వంటి క్రీడలకు కూడా వేదికగా నిలిచిందన్నారు. 1973లో కళాజ్యోతి సంస్థ ఏర్పడి కళావేదిక ద్వారా పట్టణ ప్రజలకు సాహిత్యం, సంగీత, నాటక, నృత్య కార్యక్రమాలను అందించిందన్నారు. అనంతరం ఈసీఆర్‌ఆర్ సరస్వతి నిలయంతో కలిసి ఒకే సంస్థగా ఏర్పడి ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ధర్మవరం రామకృష్ణమాచార్యుల వర్ధంతి కార్యక్రమాలు, సురభి నాటక ప్రదర్శనలకు కళాజ్యోతిక వేదికగా మారిందన్నారు. సంస్థ అభివృద్ధికి కృషి చేసిన పాలకవర్గాలు, సభ్యులు, కళాకారులు, సాహితీవేత్తలను మంత్రి అభినందించారు.


