చిరు దివ్వెలు.. అవనికి వెలుగులు | - | Sakshi
Sakshi News home page

చిరు దివ్వెలు.. అవనికి వెలుగులు

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

అమ్మ కష్టం తెలుసు... నాన్న మోసే బరువూ తెలుసు.. అందుకే ఆశలకు రెక్కలు తొడిగావు.. కన్నీళ్లను దాటి కలల్ని గెలిచావు.. అమ్మా నాన్న కంట్లో ఆనంద భాష్పాలయ్యావు.. భారం కాదు.. భరోసాగా నిలిచావు.. అన్నదమ్ముల్లోనూ స్ఫూర్తి నింపావు.. అందుకే బిడ్డా.. నీముందు ఎవరైనా దిగదుడుపేరా...

వెండి‘తెర తీసిన’ ఖుషీగౌడ్‌

రొళ్ల: మండలంలోని టీటీ పల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ, భారతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న బిడ్డ ఖుషీగౌడ్‌ చిన్నప్పటి నుంచే అన్ని విషయాలనూ సృజనాత్మకంగా ఆలోచించేది. చదువుతో పాటు ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేది. దీంతో తల్లిదండ్రులు ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించారు. ఐదారేళ్ల వయస్సులోనే నృత్యంతో పాటు క్రీడల్లో ప్రోత్సహించారు. ఏ రంగంలోనైనా రాణించే ఖుషీగౌడ్‌ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన భవితకు బాటలు వేసుకుంది. అనంతరం తనకో గుర్తింపుకావాలన్న తపనతో అందాల పోటీల్లో పాల్గొంది. అందరూ విమర్శించినా తండ్రి బాలకృష్ణ ప్రోత్సహంతో ముందుకుసాగింది. ఈ క్రమంలోనే 2020లో కర్ణాటక ‘మిస్‌ టీన్‌’, 2021 ‘మిస్‌ కర్ణాటక’ టైటిళ్లను సొంతం చేసుకుంది. అందంతోపాటు ఆమె చాతుర్యం, హావభావాలు గమనించిన సినీ దర్శకుడు ఆర్‌కే గాంధీ తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న ‘త్రిష’ మూవీలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం కల్పించారు. మారుమూల పల్లె నుంచి వెండితెరదాకా సాగిన ఆమె ప్రయాణం గురించి ఎవరు మాట్లాడినా... తన తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని చెబుతారు. బిడ్డ ఆసక్తి గమనించి ప్రోత్సహించిన బాలకృష్ణ, భారతి దంపతులనూ అందరూ అభినందిస్తుండగా వారు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు.

నాన్న కల సాకారం చేస్తా

సమాజానికి ఉపయోగపడే స్థాయిలో ఉండాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నాన్న మాధవాచారి ఎప్పుడూ చెప్పేవారు. అది నాలోబలంగా నాటుకుంది. మా అమ్మ సాయికుమారి గృహిణి అయినప్పటికీ ఎప్పుడూ నాలో స్ఫూర్తి నింపేది. నేను చిత్తూరులోని అపోలో మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. నేను కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలన్నది నాన్న కల. అందుకే డాక్టర్‌ మేఘన..అని అందరూ అంటున్నా... ఏదో వెలితి. అందుకే నాన్న కలను సాకారం చేయాలని నిర్ణయించుకుని ప్రస్తుతం సివిల్స్‌కు సిద్ధమవుతున్నా. లక్ష్యం పెద్దదైనప్పుడు దారి కూడా సులభంగా ఉండదని తెలుసు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నన్ను నేను మెరుగు పరుచుకుంటున్నా. నాన్న కలను నెరవేర్చిన రోజే నాకు నిజమైన ఆనందం. అంతవరకూ కష్టపడతా.

– డాక్టర్‌ ఎం.మేఘన, ఎన్‌పీకుంట

మిస్‌ కర్ణాటక అందాల పోటీలో ఖుషీగౌడు (ఫైల్‌)

శ్రావణి కూత.. నాన్న ఆటోకు బాట

రొద్దం: మండల పరిధిలోని కోగిర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ రామాంజనేయులు, దేవిక దంపతుల కూతురు శ్రావణి విజయాల కూత పెడుతోంది. తండ్రి కష్టానికి ఇంధనంలా మారి బతుకుబాటలో దూసుకుపోతోంది. కోగిర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రావణి తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని, తద్వారా తన తండ్రీకి పేరు రావాలని భావించింది. ఇందుకు క్రీడలను ఓ సాధనంగా ఎంచుకుంది. మరోవైపు తండ్రి రామాంజనేయులు కూడా ఆమెను ప్రోత్సహించడంతో ఇటు సాఫ్ట్‌బాల్‌, అటు కబడ్డీల్లో రాణిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో మూడు సార్లు రాష్ట్ర స్థాయి టోర్నీల్లో రాణించింది. ఈ ఏడాది ఆగస్టు 30న అమరావతి చాంపియన్‌ షిప్‌ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరఫున బరిలో నిలిచి సత్తాచాటింది. శ్రావణి విజయాల కూతతో మనస్పర్థలతో దూరంగా ఉన్న తల్లికూడా ఇప్పుడు భర్తను చేరుకుని బిడ్డవెంట నడుస్తోంది. పేదరికంతో చెడుగుడు ఆడుతూనే తల్లిదండ్రులను కలిపిన శ్రావణిని అందరూ అభినందిస్తుండగా...తండ్రి రామాంజనేయులు విజయగర్వంతో ఆటోను నడిపిస్తున్నాడు.

తల్లిదండ్రులతో శ్రావణి

● అగళి మండలం ఆలూడి గ్రామానికి చెందిన కాంతరాజు, రత్నమ్మ దంపతులకు నలుగురూ కూతుళ్లే. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లోనూ పిల్లలందరినీ చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని, తమకోసం వారు చేస్తున్న త్యాగాలను కళ్లారా చూసిన నాలుగో కుమార్తె లక్ష్మీసంధ్య తన చదువుతో తమ కుటుంబ పరిస్థితులు బాగుపడతాయని భావించింది. ఈ మేరకు రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. ‘నీట్‌’లో అద్భుతమైన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో 1,791 ర్యాంకు సాధించింది. ప్రస్తుతం కడప ‘రిమ్స్‌’లో వైద్య విద్య అభ్యసిస్తోంది. త్వరలోనే డాక్టర్‌గా పేదలకు సేవలందించడంతోపాటు తన తల్లిదండ్రులకు ఏ కష్టం కలగకుండా చూసుకోవడమే తన ధ్యేయమని లక్ష్మీసంధ్య చెబుతోంది. పేదరికంలో ఉంటూ పెద్ద కలలు కనే ప్రతి ఒక్క విద్యార్థికీ ఆమె స్ఫూర్తిగా నిలుస్తోంది.

నా కూతుళ్లే నా కళ్లు

నా కూతుళ్లే నా రెండు కళ్లు. చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదువుకుని నాకు మంచిపేరు తెచ్చారు. పెద్ద అమ్మాయి పామిడి మిస్బా కుప్పం మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ఫాతిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో పిడియాట్రిక్‌లో పీజీ చేసింది. రెండో కుమార్తె మెహనాజ్‌ అఫీఫా కడప రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ఫాతిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో పీజీ చేస్తోంది. ఉపాధ్యాయుడిగా నాకొచ్చిన పేరుకంటే నా బిడ్డల వల్ల వచ్చిన పేరే ఎక్కువ. నాకు కూడా అదే చాలా ఇష్టం. అందుకే గర్వంగా చెబుతా నాకు ఇద్దరు కూతుళ్లని. ఆడపిల్లలను బాగా చదివించి ప్రయోజకుల్ని చేస్తే సమాజంలో మంచి స్థాయికి ఎదుగుతారు. తల్లిదండ్రులకూ పేరు తెస్తారు.

– ముంతాజ్‌ అలీ,

విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయడు, గాండ్లపెంట

అగళి: మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్‌ మంజునాథ్‌, పవిత్ర దంపతుల కుమార్తె హర్షిత చిన్నప్పటి నుంచీ చదువుల్లో రాణించేది. తండ్రి కష్టాన్ని కళ్లారా చూస్తూ పెరిగిన హర్షిత...చదువుతో తన భవిత మార్చుకుని తండ్రి కష్టాన్ని తీర్చాలనుకుంది. కష్టపడి చదివి ‘నీట్‌’ పరీక్షలో సత్తాచాటింది. ప్రస్తుతం కడపలోని ‘రిమ్స్‌’లో ఎంబీబీఎస్‌ చదువుతోంది. తల్లిదండ్రులు, ఆర్డీటీ సంస్థ ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న హర్షిత త్వరలోనే డాక్టర్‌ కోటుతో నాన్న కల నెరవేర్చేందుకు సిద్ధమైంది. కల నెరవేర్చుకునేందుకు పట్టుదలతో శ్రమిస్తే పేదరికం అడ్డుకాదని హర్షిత విజయం నిరూపిస్తోంది.

తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తున్న బంగారు తల్లులు

విజేతలై మెరుస్తూ... సమాజానికి వెలుగునింపుతున్న అమ్మాయిలు

సమాజానికే ఆదర్శం.. మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న వైనం

సందర్భం : నేడు ‘వరల్డ్‌ డాటర్స్‌డే’

కూలీల బిడ్డలు.. డాక్టర్లు

తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి.. కుటుంబ, ఆర్థిక, సామాజిక సవాళ్లను అధిగమిస్తూ.. చదువు, క్రీడలు, ఉద్యోగం, వ్యవసాయం, కళలు, సేవా రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు బంగారు తల్లులు. వారి గురించి ‘డాటర్స్‌డే’ సందర్భంగా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మన ఇంటి బంగారు తల్లులనూ తలెత్తుకుని తిరిగేలా తీర్చిదిద్దుదాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement