● ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
అనంతపురం సెంట్రల్: తొమ్మిది నెలల శిక్షణ అనంతరం ప్రజా సేవలోకి అడుగుపెడుతున్న 2025–2026 బ్యాచ్ సివిల్ కానిస్టేబుళ్ల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆనంద క్షణాలు.. అపురూప ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. 2025–26 బ్యాచ్‌కు సంబంధించి డీటీసీలో 101 మంది, పీటీసీలో 582 మంది ఎస్‌సీటీపీసీ (సివిల్) బ్యాచ్ కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరికి శనివారం అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ) మైదానంలో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవందనం స్వీకరించారు.
పోలీసుల పాత్ర కీలకమైనది
మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రమాదాలకు ఎదురెళ్లి విధులు నిర్వర్తించేవారే పోలీసులని, వారి త్యాగాల వల్లనే ప్రజలు హాయిగా నిద్రపోతున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయిందని, నేరపరిశోధనలో భాగంగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసుశాఖ కీర్తి మరింత పెంచేలా, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద బ్యాచ్‌కు అనంతపురం నుంచి పాసింగ్ ఔట్ జరగడం అభినందనీయమన్నారు. ఇండోర్, అవుట్ డోర్ శిక్షణలో ప్రతిభ కనబరచిన పోలీసులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, పీటీసీ ప్రిన్సిపాల్ సుప్రజ, ట్రైనింగ్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సీఐలు, అధికారులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు పాదాభివందనం టోపీలతో తల్లిదండ్రులను సన్మానిస్తున్న అన్నదమ్ములు


