కదిరి టౌన్: హైకోర్టు న్యాయమూర్తులు బీఎస్ భానుమతి, కె.సురేష్‌రెడ్డి, చల్లా గురురంజన్ శనివారం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సేవలో గడిపారు. సాయంత్రం వేళ ఖాద్రీశుని దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు న్యాయమూర్తులకు తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు. అనంతరం శ్రీవారి చిత్రపటాన్ని ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
● ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
కమిషనర్ చక్రధర్
ధర్మవరం అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారంతా నిరుపేదలే ఉంటారని, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపీ సముదాయం, క్యూ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం నేరుగా ఎక్స్‌రే గదికి వెళ్లి తన మోకాలికి ఎక్స్‌రేను తీయించుకుని డాక్టర్ సలహా తీసుకున్నారు. ఈ సందర్భంగా పోతుకుంటరోడ్డులో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతాశిశు ఆస్పత్రిని ప్రారంభించాలని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ నరసింహులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేయాలని విన్నవించారు. తనిఖీల్లో జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీకాంత్, ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ హరిశ్రీనివాస్, వైద్యులు ఉన్నారు.
బోధనలో నైపుణ్యాలు
పెంచుకోవాలి
● ఉపాధ్యాయులకు
డీఈఓ కిష్టప్ప సూచన
పెనుకొండ రూరల్: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కిష్టప్ప ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం ఆయన గుట్టూరు జెడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టికతో పాటు వివిధ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి వారి విద్యా నైపుణ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈసారి పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నాగార్జునుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘చలో విజయవాడ’కు అనుమతి లేదు
పుట్టపర్తి టౌన్: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదని, అందువల్ల జిల్లాకు చెందిన సచివాలయ ఉద్యోగులను విజయవాడ వెళ్లేందుకు అనుమతించబోమని ఎస్పీ సతీష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదన్నారు. వారంతా క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


