ప్రశాంతి నిలయం: రాయలసీమ ప్రాంతాన్ని అంతర్జాతీయ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆక్టోబర్ 2వ తేదీన మదనపల్లెలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన పంటలకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనాతో ప్రాజెక్ట్‌ను రూపొందించనుందన్నారు. ఈ క్రమంలో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రాంతాల వారీగా పంట సాగును పెంచేందుకు జిల్లాను క్లస్టర్లుగా విభజించి సాగును పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అధునిక వ్యవసాయ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, డ్రిప్ ఇరిగేషన్, పాలిహౌసెస్, డ్రోన్ టెక్నాలజీ, బూమ్ స్ప్రేయర్లు వంటి ఆధునిక విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఉద్యాన రైతులకు అవసరమైన క్రెడిట్, కిసాన్ లోన్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్టోబర్ 2న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆర్‌ఎస్‌కే కార్యాలయాల్లో వర్చువల్‌గా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్


