కెనరా బ్యాంకు గోల్డ్‌ అప్రైజర్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంకు గోల్డ్‌ అప్రైజర్‌ అరెస్ట్‌

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

మడకశిర: స్థానిక కెనరా బ్యాంకులో నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.లక్షల్లో రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, గోల్డ్‌ అప్రైజర్‌ సుందరేశ్‌చారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక రూరల్‌ సర్కిల్‌ పోలీస్‌ కార్యాలయంలో హిందూపురం ఏఎస్పీ మహేష్‌ విలేకరులకు వెల్లడించారు.

అన్నంపెట్టిన బ్యాంకుకే మోసం..

గుడిబండ మండలం ఎస్‌.రాయాపురం గ్రామానికి చెందన సుందరేశ్‌చారి మడకశిరలోని కెనరా బ్యాంకులో గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా బ్యాంకులో పనిచేస్తుండటంతో పలువురు బ్యాంకు ఖాతాదారులు ఆయనపై నమ్మకంతో లావాదేవీలు సాగించేవారు. ఈ క్రమంలోనే వారి పరిచయాలను ఆయన తన సొంతపనులకూ ఉపయోగించుకునేవాడు. ఇటీవల తన డబ్బు అవసరం కావడంతో సుందరేశ్‌చారి బ్యాంకునే మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తనకు పరిచయమున్న మడకశిర మండలానికి చెందిన ఏడుగురు ఖాతాదారులను బ్యాంకుకు పిలిపించాడు. ‘నేను బ్యాంకులో పనిచేస్తున్నందున గోల్డ్‌లోన్‌ నాపేరున రాదు. అందువల్ల మీ పేరు మీద బంగారు నగలను తాకట్టు పెట్టుకుని రుణం తీసుకుంటాను’ అని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. ఇలా ఏడుగురిపై 12 గోల్డ్‌లోన్ల ఖాతాలు తెరిచి 872.8 గ్రాముల నకిలీ బంగారు నగలను తాకట్టు పెట్టాడు. మొత్తంగా రూ.70.66 లక్షల రుణం తీసుకున్నాడు. ఖాతాల్లో జమ అయిన డబ్బును ఖాతాదారులతోనే డ్రా చేయించుకుని తీసుకున్నాడు. అయితే జూలై 25వ తేదీన బ్యాంకుకు రీ అప్రైజర్ల బృందం తనిఖీలు చేయగా...నకిలీ బంగారం గుట్టు బట్టబయలైంది. దీంతో అదే రోజు బ్యాంకు ఏజీఎం శ్రీనివాసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డ్‌ అప్రైజర్‌ సుందరేశ్‌చారితో పాటు ఏడుగురు ఖాతాదారులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

రుణం డబ్బుతో జల్సా..

బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించగానే గోల్డ్‌ అప్రైజర్‌ సుందరేశ్‌చారి అక్కడి నుంచి పారిపోయాడు. రుణంగా తీనుకున్న డబ్బులతో బాగా జల్సా చేశాడు. అంతే కాకుండా హార్స్‌ రేసుల్లో కూడా పాల్గొన్నాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం చాలా ప్రాంతాల్లో వెతికారు. చివరకు సుందరేశ్‌చారి వైబీహళ్లి క్రాస్‌లో ఉన్నట్లు కొందరు రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌కి శుక్రవారం సమాచారం అందించడంతో వెంటనే ఆయన సిబ్బందితో వెళ్లి సుందరేశ్‌చారిని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద ఉన్న రూ.30.20 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో బ్యాంకు ఖాతాదారులందరూ అమాయకులని, వారిని సుందరేశ్‌చారి నమ్మించాడని ఏఎస్పీ మహేష్‌ తెలిపారు. ఈ కేసుతో వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడి నుంచి మిగిలిన నగదును కూడా రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడు ఆ డబ్బుతో ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుంటామన్నారు. సమావేశంలో మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

నకిలీ బంగారు ఆభరణాల

తాకట్టు కేసులో పురోగతి

రూ.30.20 లక్షల నగదు స్వాధీనం

గుర్రపు పందేలాడుతూ

జల్సాగా గడిపిన నిందితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement