పరిగి: మెగా డీఎస్సీ అంటూ చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులను నిండాముంచి దగా డీఎస్సీగా మార్చిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నను డీఎస్సీ అభ్యర్థులు కలిసి గోడు వెళ్లబోసుకున్న వైనాన్ని చూస్తే... చంద్రబాబు సర్కార్ ఎంత మోసం చేసిందన్న విషయం యావత్ నిరుద్యోగుల్లో కలవరం రేపిందన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని శ్రీరంగరాజుపల్లి పంచాయతీ పాపిరెడ్డిపల్లిలో ‘కాఫీ విత్ వైఎస్సార్‌సీపీ లీడర్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి తొలుత గ్రామం వరకూ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రతి గడపకూ వెళ్లి కూటమి సర్కార్ హయాంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమను మోసం చేశారని ప్రజలు వాపోయారు. జగనన్నను మళ్లీ సీఎంను చేసుకుంటామని తెలిపారు.
అమరావతి రైతులను మోసం చేశారు..
చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా... అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. ఇంకా భూములు కావాలంటూ వారిని బలవంతం చేస్తున్నారన్నారు. ఈ చర్యలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 50 ఏళ్లకే బీసీలకు పింఛన్లు, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని నమ్మబలికి.. అందరినీ మోసం చేశారన్నారు.
అక్రమాలకు మారుపేరు మంత్రి సవిత..
పరిగి మండలంలో ఇసుక, మట్టి, పెనుకొండలో డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణా, విక్రయాలు, భూకబ్జాలు చేస్తున్న సవితకు మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదని ఉషశ్రీచరణ్ అన్నారు. నిజాలు మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. అభివృద్ధిపై చర్చించడానికి వైఎస్సార్‌సీపీ తరపున తాను ఎక్కడికై నా వస్తామని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, మురళీమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభ్యర్థులను నిలువునా
మోసం చేసిన చంద్రబాబు సర్కార్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్ ధ్వజం
పాపిరెడ్డిపల్లిలో ‘కాఫీ విత్
వైఎస్సార్‌సీపీ లీడర్స్’
కొత్తగా ఒక్క పింఛనైనా ఇచ్చారా..?
పెనుకొండ రూరల్: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, రెండేళ్ల పాలనలో కనీసం ఒక్క కొత్త పింఛన్ అయినా ఇచ్చారా.. అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో కూటమి నేతలు తమ అంతరాత్మను అడిగితే తెలుస్తుందన్నారు. శుక్రవారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తయినా చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకు ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి తమ జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కనీసం పింఛన్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు మాత్రమే పింఛన్‌ను బదాలాయిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఆర్థిక భరోసా కరువైందన్నారు.


