పుట్టపర్తిలోని చెత్తను బ్రాహ్మణపల్లి పొలాల వద్ద కాల్చివేసిన చెత్త
కొత్తచెరువులో వృథాగా ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రం
పుట్టపర్తి మండలం కప్పలబండలో చెత్తను కాల్చివేసిన దృశ్యం
పుట్టపర్తి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించేందుకు గ్రీన్ అంబాసిడర్లు (ప్రస్తుతం క్లాప్ మిత్రలు) నియమించి నెల నెల వేతనాలను అందిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సేకరించిన చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరలకు విక్రయించి ఆదాయాన్ని పొందేవారు. ఇటు రైతులకు అటు పంచాయతీలకు లాభదాయకంగా ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాగానే గ్రీన్ అంబాసిడర్లను ఉన్న ఫలంగా తొలగించి తమకు అనుకూలమైన వారిని చేర్చుకొని క్లాప్ మిత్రులుగా పేరు మార్చి వారితో పనులు చేయిస్తున్నారు. అయితే సచివాలయ సిబ్బందిని సచివాలయాల్లో ఉండనీయకుండా వేర్వేరు విధులకు వాడుకోవడంతో చెత్త సేకరణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
చెత్తను తగలబెడుతున్న క్లాప్ మిత్రలు
జిల్లాలో 467 పంచాయతీలు ఉండగా అందులో 432 చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,180 మంది క్లాప్ మిత్రలు పని చేస్తున్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.10 వేల వరకూ వేతనాలు చెల్లిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నెలా సుమారు రూ.1.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు.అయితే వీరంతా చేయాల్సిన పనులు చేయకుండా లక్ష్యానికి విరుద్ధంగా పని చేస్తుండడంతో లక్ష్యం నీరుగారిపోతోంది. రెండేళ్లుగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన సిబ్బంది వీధులకే పరిమితమయ్యారు. సేకరించిన తడి, పొడి చెత్తను ప్రధాన రహదారుల పక్కన ఖాళీ స్థలాల్లో పోసి తగులబెడుతున్నారు. దీంతో వారానికి రెండు, మూడు సార్లు అక్కడ కాలుష్యం పెరిగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడి, పొడి చెత్తతో పాటు కవర్లు, డైపర్లు, మిగిలిన కూరలు, అన్నం తదితరాలను ఒక చోట పోస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఆయా మండలాల ఎంపీడీఓలకు ఈ విషయం తెలియజేసినా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీంతో ప్రతి నెలా రూ.1.18 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందంటున్నారు. ఇదే కాకుండా వాళ్లకు ఇచ్చిన వాహనాలు, చెత్త సంపద కేంద్రాల స్థలాలకు చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
పట్టించుకోని అధికారులు
జిల్లాలోని గ్రామ పంచాయతీలతో పాటు పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర తదితర మున్సిపాలిటీల్లో సైతం చెత్తను ఎక్కడ పడితే అక్కడ చెత్తను పోగుచేసి తగలబెడుతున్నారు. మున్సిపాలిటీలకు అత్యాధునిక వాహనాలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నా చెత్తను డంపింగ్ యార్డులకు తరలించకుండా రోడ్డు పక్కన, గుట్టల్లో, పొలాల్లో , ఖాళీ స్థలాల్లో అంటిస్తున్నారు. దీంతో అక్కడ రోజుల తరబడి పొగ వస్తూ కాలుష్యం పెరిగిపోతోంది. సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, శానిటేషన్ ఇన్స్‌పెక్టర్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
చెత్తతో సంపద కేంద్రాలకు తరలని చెత్త
ఇళ్లు, వీధుల్లో సేకరించిన
చెత్తను కాల్చేస్తున్న క్లాప్ మిత్రలు
కాలుష్యం పెరిగిపోతోందని
సర్వత్రా ఆందోళన
పట్టించుకోని అధికారులు
చెత్తతో సంపద తయారు చేసి తద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని అందించాలన్న ప్రభుత్వాల లక్ష్యం నీరుగారిపోతోంది. సేకరించిన చెత్త
సంపద కేంద్రాలకు కూడా చేరడం లేదు. చెత్తా చెదారాన్ని ఒకే చోటికి చేర్చి పారిశుధ్య సిబ్బంది కాల్చేస్తున్నారు. దీంతో చెత్త నుంచి సంపద కాదు కాలుష్యం పెరిగిపోతోంది.
జిల్లాలోని పంచాయతీల సంఖ్య : 467
చెత్త సంపద కేంద్రాలు : 432
క్లాప్ మిత్రల సంఖ్య : 1,180
ప్రతి నెలా వారికి చెల్లిస్తున్న
వేతనం : దాదాపు 1.18 కోట్లు
చెత్త కాల్చకుండా చర్యలు
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న క్లాప్ మిత్రలకు తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తాం. చెత్తను సంపద కేంద్రాలకు కాకుండా ఖాళీ ప్రదేశాల్లో అంటించకుండా చర్యలు తీసుకుంటాం. చెత్త నుంచి సందప సృష్టించేలా అధికారులందరినీ సమన్వయం చేస్తాం. తద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చేలా చూస్తాం.
– సమత, డీపీఓ


