సాక్షి, పుట్టపర్తి: అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ప్రాంతమని.. తాను అధికారంలోకి వచ్చాక జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో హామీ గుప్పించారు ప్రస్తుత సీఎం చంద్రబాబు. ‘సూపర్ సిక్స్’తో పాటు క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీల అమలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
గతేడాది పింఛన్ల పంపిణీ కోసం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి వచ్చిన సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కదిరి పట్టణానికి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొస్తే ఖర్చు ఎక్కువ వస్తోంది. అందుకే చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు ఖర్చు తగ్గిస్తామన్నారు. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. అలాగే కదిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, పట్టణానికి రింగు రోడ్డు, తిరువీధుల విస్తరణ హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. కదిరిలో ప్రెస్‌క్లబ్ నిర్మాణం చేస్తామని చంద్రబాబు చేతుల మీదుగా వేసిన శిలాఫలకం కూడా ఇప్పటికీ వెక్కిరిస్తోంది.
మడకశిర పర్యటనలో చంద్రబాబు లెక్క లేనన్ని హామీలు ఇచ్చారు. 2024 ఆగస్టు 1న గుండుమల పర్యటన సందర్భంగా వక్క మార్కెట్, హంద్రీనీవా పూర్తి, మడకశిర వద్ద వెయ్యి ఎకరాల్లో పారిశ్రామికవాడ క్లస్టర్, రూ.60 కోట్లతో రింగ్ రోడ్డు, ఎన్‌హెచ్ 44 నుంచి పెనుకొండ నుంచి మడకశిర మీదుగా కర్ణాటకలోని హిరియూరుకు అనుసంధానం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ లేదు. జాతీయ రహదారి పనులు ప్రారంభం కాలేదు. వక్క మార్కెట్ కోసం స్థల పరిశీలన మాత్రమే చేశారు. పారిశ్రామికవాడ గురించి పట్టించుకునే నాథుడు లేరు.
అధికారంలోకి వచ్చిన వెంటనే సోమందేపల్లి చెరువుకు హంద్రీనీవా కాలువ నుంచి నీరు మళ్లిస్తామని సవిత హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. అలాగే పెనుకొండలో పాలిటెక్నిక్ కాలేజీ కట్టిస్తామన్నారు. స్థల పరిశీలన కూడా జరగలేదు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలు గుప్పించడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను మోసం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరు. గత ఎన్నికల సందర్భంగా జిల్లా వాసులకు అలవిగాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అటకెక్కించారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ కేంద్రం ప్రారంభోత్సవానికి నేడు పుట్టపర్తికి సీఎం హోదాలో చంద్రబాబు వస్తున్న సందర్భంగా గత హామీలను ప్రజలు గుర్తు చేస్తున్నారు.
చేనేతలపైనా చిన్నచూపే..
ఎన్నికల సమయంలో నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు రూ .10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే చేనేతలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామన్నారు. అంతకుముందు ఐదేళ్లు వర్తించిన ‘నేతన్న నేస్తం’ కూడా ఎగ్గొట్టారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు గతంలో ఇచ్చిన రూ.5 లక్షల పరిహారాన్ని రూ.1.50 లక్షలకు తగ్గించి నిలువునా మోసం చేశారు.
అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా హామీల అమలును పట్టించుకోని
సీఎం చంద్రబాబు
నీటి మీద రాతగానే చేనేతలకు
రూ.10 లక్షల పరిహారం
కదిరికి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ
ఇప్పటికీ కరువు
పుట్టపర్తిలో 193 చెరువులకు
నీళ్లు ఉత్తుత్తి మాటలే..
సోమందేపల్లిలో పారని
హంద్రీ–నీవా జలాలు
మడకశిరకు రెండు రిజర్వాయర్లు,
వక్క మార్కెట్ పట్టదా?
నేడు పుట్టపర్తిలో యుద్ధవిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ
కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్‌తో పాటు హాజరు కానున్న చంద్రబాబు
‘పుట్టపర్తి’లో 193 చెరువులకు నీరేదీ ?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన 193 చెరువుల అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగిస్తామని హంద్రీనీవా కాలువ ద్వారా అన్ని చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే సత్యసాయి తాగునీటి ప్రాజెక్టును దత్తత తీసుకుంటానని నారా లోకేశ్ మాట ఇచ్చారు. వాటికి సంబంధించి నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. నియోజకవర్గంలోని చెరువులన్నీ హంద్రీనీవా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు కలిపి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా మాటలకే పరిమితమైంది.
కదిరి ప్రజల దాహార్తి తీర్చేదెన్నడో...
కానరాని రిజర్వాయర్ల జాడ..
సోమందేపల్లికి కృష్ణాజలాలు కరువు


