పెనుకొండ: వేర్వేరు ఘటనలో అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరితో పాటు ఒక అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.15.5 లక్షల విలువైన బంగారు నగలు, వెండి సామగ్రి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ సీఐ రాఘవన్ తెలిపారు. సోమవారం స్తానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి తాలూకా నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉల్లెడ మల్లేష్, నవీన్‌కుమార్, అనంతపురంలోని టీవీ టవర్ ప్రాంతంలో నివాసముంటున్న షికారి శివ అలియాస్ అర్జున్ ఉన్నారు. గత నెల 17న రొద్దం మండలం శేషాపురం గ్రామ ఆలయంలో హుండీ అపహరించి అందులోని 100 గ్రాముల వెండి సామగ్రి, గోరంట్ల, ధర్మవరం వన్‌టౌన్ పీఎస్‌ల పరిధిలో పలు ఇళ్లలో చొరబడి బంగారు నగలు, కనగానపల్లి, సీకేపల్లి పీఎస్‌ల పరిధిలో 2 ద్విచక్ర వాహనాలను అపహరించిన కేసులో కర్ణాటక ప్రాంతానికి చెందిన మల్లేష్, నవీన్‌కుమార్ నిందితులని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 8న వీరిద్దరూ రొద్దం మండలం పెద్దమంతూరులోని జెడ్పీహెచ్‌ఎస్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా ఎస్‌ఐ వీరాంజనేయులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించారన్నారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు వివరించారు. అలాగే సోమవారం ఉదయం పెనుకొండ రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న షికారీ శివని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో పెనుకొండ, సోమందేపల్లిలోని ఇళ్లలో జరిగిన చోరీ కేసుల్లో నిందితుడిగా నిర్ధారణ అయిందన్నారు. ఇతని నుంచి రూ.5.5 లక్షల విలువ చేసే రెండు బంగారు చైన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
రూ. 15.5 లక్షల విలువజేసే బంగారు నగలు, వెండి, 2 ద్విచక్ర వాహనాల స్వాధీనం


