కర్కశంగా చంపి.. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

కర్కశంగా చంపి.. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి..

Mar 10 2026 7:11 AM | Updated on Mar 10 2026 7:11 AM

ఇల్లాలిని బలిగొన్న వివాహేతర సంబంధం

అనాథలైన ముగ్గురు చిన్నారులు

తాడిపత్రి రూరల్‌/పెద్దపప్పూరు: వివాహేతర సంబంధం ఓ ఇల్లాలి ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భర్తే ఆమెను చంపి, కర్కశంగా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీసులకు లొంగి పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం గద్దరగుట్టపల్లి గ్రామానికి చెందిన గంగరాజు, రంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితం తాడిపత్రిలోని జయనగర్‌ కాలనీలో స్థిరపడ్డారు. గంగరాజు ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరి కుమార్తె శ్రీలేఖకు 8 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మేడిమాకులపల్లి గ్రామానికి చెందిన సమీప బంధువులు సుంకన్న, రాములమ్మ దంపతుల కుమారుడు ఎరికల సుధాకర్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో 10 తులాల బంగారు నగలను కట్నంగా శ్రీలేఖ తల్లిదండ్రులు ఇచ్చారు. మేడిమాకులపల్లిలోనే కాపురముండేవారు. వీరికి కుమారులు ఏడేళ్ల వరుణ్‌సాయి, ఆరేళ్ల దీక్షిత్‌, ఐదేళ్ల రిత్విక్‌ ఉన్నారు.

ఉపాధి కోసం భర్త దూరంగా..

రెండేళ్ల క్రితం సుధాకర్‌ తన భార్య వద్ద ఉన్న 8 తులాల బంగారు నగలను అమ్మి ఆ డబ్బు తీసుకుని సంపాదన పేరుతో దుబాయి వెళ్లాడు. దీంతో శ్రీలేఖ పుట్టింటికి చేరుకుని అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి సపర్యలు చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చింది. భర్తకు దూరంగా ఉండడంతో మరో వ్యక్తితో శ్రీలేఖ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దుబాయి నుంచి వచ్చిన భర్త.. లారీ డ్రైవర్‌గా జీవనం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో భార్య వివాహేతర సంబంధం బయటపడడంతో పలు మార్లు నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. గొడవ పెరిగి తాడిపత్రి అప్‌గ్రేడ్‌ పీఎస్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువురినీ పోలీసులు మందలించి పంపారు. అనంతరం భర్తను వదిలి వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో కలసి శ్రీలేఖ వెళ్లిపోయింది. దీంతో పోలీసుల సుధాకర్‌ ఆశ్రయించి వారి ద్వారా ఆమెను తిరిగి పిలుచుకుని వచ్చాడు. ఆ తర్వాత కూడా శ్రీలేఖ భర్తకు దూరంగా ఉంటూ తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న పీజీకి మకాం మార్చింది.

ఫిర్యాదుకు నిరాకరణ

తనతో కాపురం చేయకుండా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని జీర్ణించుకోలేని సుధాకర్‌ భార్యను హతమార్చడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పీజీ వద్దకెళ్లిన సుధాకర్‌ మాయమాటలతో తన భార్యను పిలుచుకుని లారీలో పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని మొదటి మలుపు వద్దకు పిలుచుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు చున్నీ బిగించి హతమార్చిన అనంతరం కాలికి చున్నీ కట్టి మృతదేహాన్ని లారీలో నుంచి లాగి కిందకు పడేశాడు. కాలికి కట్టిన చున్నీతోనే రోడ్డు పక్కన ఈడ్చుకుంటూ వెళ్లి మోరీ కింద పడేసి నేరుగా పెద్దపప్పూరు పీఎస్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, శ్రీలేఖ మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న హతురాలి కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. హతమార్చిన అల్లుడు కానీ, అతని కుటుంబసభ్యులు కాని ఆస్పత్రికి వచ్చేవరకూ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వబోమని భీష్మించారు. దీంతో ఆరు గంటల పాటు పోస్టుమార్టం ఆగిపోయింది. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలు పాలు కావడంతో చిన్నారులు అనాథలయ్యారంటూ మార్చురీ వద్ద బంధువులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. చివరకు హతురాలి తల్లి రంగమ్మకు పోలీసులు నచ్చచెప్పి ఫిర్యాదు స్వీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement