చింతపండు @ 20 వేలు | - | Sakshi
Sakshi News home page

చింతపండు @ 20 వేలు

Mar 10 2026 7:11 AM | Updated on Mar 10 2026 7:11 AM

హిందూపురం: స్థానిక మార్కెట్‌ యార్డులో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.20 వేలు పలికింది. సోమవారం మార్కెట్‌కు 5,200 క్వింటాళ్ల చింతపండు రాగా, అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టం రూ.10 వేల చొప్పున క్రయ విక్రయాలు సాగినట్లు మార్కెట్‌ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్‌ చింతపండు క్వింటాల్‌ గరిష్టంగా రూ.12,500, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికినట్లు ఆయన వెల్లడించారు. యార్డులో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి సరైన ధరలకు విక్రయించుకోవాలని యార్డు కార్యదర్శి సూచించారు.

పరిష్కార వేదికకు 63 వినతులు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్‌ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఆంకిత సురానా, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

అనంతపురం సెంట్రల్‌: ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. స్థానిక రుద్రంపేట సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పిస్తాహౌస్‌ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 65 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి గాయపడడంతో స్థానికులు గుర్తించి, అదే రోజు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. సోమవారం పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు. మిస్సింగ్‌ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని అనంతపురం ట్రాఫిక్‌ సీఐ వెంకటేష్‌ నాయక్‌ కోరారు.

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్‌ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ పేర్కొన్నారు. ప్రతి కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. 7, 8, 9, 10 తరగతి, ఇంటర్‌ రెండో సంవత్సరంలో ప్రస్తుతం ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https:// apkgbv.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌ ద్వారా అందజేసే దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితా ఏప్రిల్‌ 13న విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 13 నుంచి 17 వరకు సంబంధిత కేజీబీవీల్లో ధ్రువపత్రాలు పరిశీలించి తరగతుల వారీగా సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అనాథ, నిరుపేద ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఓపెన్‌ ‘పది’

హాల్‌ టికెట్ల విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ (సార్వత్రిక విద్యాపీఠం) ద్వారా ఈ నెల 16 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు హాల్‌టికెట్లను ఏపీ ఓపెన్‌స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అనంతపురం డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. అలాగే ఏఐ సెంటర్ల నుంచి కూడా పొందవచ్చన్నారు. వాట్సాప్‌–మనమిత్ర ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 95523 00009కు ‘ఏజీ’ అని మెసేజ్‌ పంపాలి. ‘చూస్‌ సర్వీస్‌’ లేదా ‘సేవను ఎంచుకోండి’పై క్లిక్‌ చేయాలి. తర్వాత ‘ఎడ్యుకేషన్‌ సర్వీస్‌’ లేదా ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘ఏపీ ఓపెన్‌స్కూల్‌ ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌, మార్చ్‌–2026 హాల్‌ టికెట్స్‌’ను ఎంచుకోవాలి. తర్వాత విద్యార్థి ‘అడ్మిషన్‌ నంబరు, పుట్టినతేదీ’ నమోదు చేయాలి. అనంతరం ‘కన్ఫమ్‌’పై క్లిక్‌ చేస్తే హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుందని డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement