పుట్టపర్తి అర్బన్: స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆర్డీఓ సువర్ణ మాట్లాడుతూ.. ఉపాధి కోసం అమ్మాయిలు ఎక్కడికై నా సురక్షితంగా వెళ్లగలిగేలా కనీస చట్టాలు అమలు చేయాలన్నారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీపీఓ సమత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సిబ్బంది పాల్గొన్నారు.
రైలులో మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా
ధర్మవరం అర్బన్: రైలులో గంజాయి, మత్తు పదార్థాలు రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంచినట్లు జీఆర్‌పీ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌హెచ్‌ఓ షణ్ముకానందరెడ్డి తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌కు వచ్చిన పలు రైళ్లను శనివారం వారు తనిఖీ చేశారు. ప్రయాణికుల బ్యాగులను నిశితంగా పరిశీలించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు.
● కదిరి టౌన్: ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా కదిరి రైల్వేస్టేషన్‌లో జీఆర్‌పీ ఎస్‌ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రతి రైలులోనూ ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఉత్తమ కండక్టర్‌గా జయలక్ష్మి
కదిరి అర్బన్: నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ, ప్రయాణికుల పట్ల సౌమ్యంగా వ్యవహరిస్తూ, సంస్థకు ఆదాయ వనరులు పెంచేందుకు కృషి చేస్తున్న కదిరి ఆర్టీసీ డిపో కండక్టర్ జయలక్ష్మిని ఉత్తమ కండక్టర్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు డిపో మేనేజర్ రామకృష్ణ శనివారం వెల్లడించారు. ఏటా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ మహిళా కండక్టర్లను ఎంపిక చేసి సత్కరిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ సారి జయలక్ష్మిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తిలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జిల్లా ప్రజారవాణాధికారి చేతుల మీదుగా అవార్డును ఆమె అందుకోనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జయలక్ష్మిని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు హరిమోహన్, ఎన్‌వీ రమణ, బైరిశెట్టి తదితరులు అభినందించారు.
భక్తిశ్రద్ధలతో సంకీర్తనలు
రొళ్ల: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీనృసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ ఆవరణలో భక్తి శ్రద్ధలతో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకువజామున ఆలయంలో మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి వెండి, బంగారు ఆభరణాలు, భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు, వడి బియ్యం, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో దేవత సంకీర్తనలు, హరికథలు, భజనలు జరిగాయి. అంతకు ముందు స్థానిక అమవాస్య దేవాలయం నుంచి ఆచారం ప్రకారం గౌడ కులస్తులు ఊరేగింపుగా కలశాన్ని ఈరముద్దమ్మ ఆలయానికి చేర్చి పట్టంపై కూర్చొబెట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజాము 5.30 గంటల నుంచి భూతప్పల ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఒక్క రోజే వేల సంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో వారి సౌకర్యార్థం నాలుగైదు ప్రాంతాల్లో దాతల సహకారంతో అన్నదానం, చల్లటి పానీయాలు, మజ్జిగ వంటి అందించేలా చర్యలు తీసుకున్నారు.


