కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లల మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లల మృతి

Mar 8 2026 7:57 AM | Updated on Mar 8 2026 7:57 AM

తాడిమర్రి: కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతిచెందాయి. తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జీవాల పోషణతో జీవనం సాగిస్తున్న గ్రామానికి చెందిన బిల్లే శివయ్య తన గొర్రెలను శనివారం మేపునకు తోలుకెళుతూ వాటి 30 పిల్లలను దొడ్డిలో వదిలి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చే సమయానికి దొడ్డిలో 30 గొర్రెల పిల్లలతో పాటు ఓ గొర్రె మృతి చెంది ఉన్నాయి. ఎవరూ లేని సమయంలో వీధికుక్కలు చొరబడి జీవాలపై దాడి చేసినట్లుగా నిర్ధారణ అయింది. ఘటనతో రూ.3 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు.

చెరువులో పడి వృద్ధురాలి మృతి

ధర్మవరం రూరల్‌: ప్రమాదవశాత్తు చెరువులో పడి రావులచెరువు నివాసి నారాయణమ్మ (62) మృతి చెందింది. కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతుండే ఆమె శనివారం చెరువు కట్టపై సంచరిస్తూ గంగమ్మ గుడి వెనుక అదుపు తప్పి నీటిలో పడిపోయింది. స్థానికులు గుర్తించేలోపు మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరందించాలి

హిందూపురం: హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేలా డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేయాలని జలసాధన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ రాజుస్వరూప్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు లక్ష్యం మేరకు రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.45 లక్షల ఎకరాలు ఉన్నాయన్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే 80 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమితి నాయకులు శ్రీనివాసులు, ఉపేంద్ర కుమార్‌, కృష్ణ, పెద్దన్న, వీరనారప్ప, ఏసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement