బ్రహ్మోత్సవం.. శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవం.. శ్రీకారం

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

బ్రహ్

బ్రహ్మోత్సవం.. శ్రీకారం

కదిరి: భక్తుల కోర్కెలు తీరుస్తూ ఇలవేల్పుగా పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అర్చకులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మంగళవాయిద్యాల మధ్య నారసింహుడిని రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపానికి తీసుకువచ్చి పూజలు చేశారు.

పుట్ట మన్ను కోసం మేదిని పూజ..

అర్చక పండితులు నిర్ణీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో పుట్ట మన్ను సేకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలిక(కుండ)లలో నవ ధాన్యాలతో అంకురార్పణం చేశారు. నవగ్రహాలకు సంకేతంగా నవ ధాన్యాలు వేశారు. ఇందులో గోధుమలు(సూర్యుడు), బియ్యం(చంద్రుడు), కందులు (కుజుడు), పెసలు (బుధుడు), శనగలు (బృహస్పతి), అలసందలు (శుక్రుడు), నువ్వులు (శని), మినుములు (రాహువు), ఉలవలు (కేతువు)లను పాలికల్లో విత్తారు. అంతకుమునుపు అవసరమైన పుట్ట మన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదిని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తిని పఠించారు. ఈ నవధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ రోజూ నీరు పోసి మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ ఏడాది బాగా పండుతుందని భక్తుల నమ్మకం. నారసింహుడు ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి, ఇక్కడి నుంచే భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తారు.

యాగశాలలో అగ్ని హోత్రం..

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తర్వాత యాగశాలలో అగ్నిహోత్రం వెలిగించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేవరకూ అగ్నిహోత్రం ఆరకుండా అర్చకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఉత్సవాలను నలుదిక్కులూ చాటేందుకు శనివారం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రధాన ధ్వజ స్తంభానికి గరుడ దండాన్ని ధ్వజారోహణం చేస్తారు. దీన్ని బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేరోజు అంటే తీర్థవాది నాడు శ్రీవారి చక్రస్నానం తర్వాత అవరోహణం చేసి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. శ్రీవారి అంకురార్పణకు ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన కేఎన్‌ నాగేశ్వర రావు కుటుంబీకులు వ్యవహరించినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఖాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు

అంకురార్పణ

కమనీయంగా సాగిన అగ్ని హోత్రం

నేడు శ్రీవారి కల్యాణోత్సవం

నేడు ఖాద్రీశుని కల్యాణం..

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన శ్రీవారి కల్యాణోత్సవం శనివారం(నేడు) వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఆలయ అధికారులతో పాటు పోలీసు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకు వస్తారని ఆలయ డిప్యూటీ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ కనులారా వీక్షించేలా ఆలయ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రహ్మోత్సవం.. శ్రీకారం 1
1/1

బ్రహ్మోత్సవం.. శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement