చోరీలు చిన్నవి.. నష్టం పెద్దది
కాపర్ వైర్, ఆయిల్ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి పూట పంట పొలాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకుండా పోయింది.
ధర్మవరం: ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు చెలరేగిపోతున్నారు. రైతులు బోరు బావుల వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి అందులోని కాపర్‌వైర్, ఆయిల్ తదితర ఉపకరణాలను అపహరించి గుజరీలో అమ్మడాన్ని పరిపాటిగా మార్చుకున్నారు. ఆయా ఘటనలో చూసేందుకు చిన్నవిగానే కనిపించినా... రైతులకు కలిగే నష్టం మాత్రం చాలా ఎక్కువ.
పంట నష్టంతో పాటు ఆర్థిక భారం
రైతుల తోటల్లోని ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ 200 కిలోల బరువు ఉంటుంది. అందులో కాపర్ వైర్ ఒక్కటే 150 కిలోల వరకూ ఉంటుంది. మార్కెట్‌లో రాగి ధర రూ. 1,247 పలుకుతోంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో వినియోగించే ఆయిల్ లీటర్ రూ.64తో విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి, ఆయిల్ అపహరించి విక్రయిస్తే ఎంత లేదన్నా సగం ధర లెక్కించినా రూ. లక్ష వరకూ చేతికి అందుతుంది. దీంతో ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు ట్రాన్స్‌ఫార్మర్లనే లక్ష్యం చేసుకుని విధ్వంసాలకు తెరలేపారు. అయితే చోరీ సొత్తు కాబట్టి దొంగల చేతికి అందేది అరకొర సొమ్మే అయినా రైతులకు మాత్రం భారీగా నష్టం వాటిల్లుతోంది. ఒక్కసారి పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం జరిగితే పంటకు సకాలంలో నీరందక ఎండిపోయి రైతులు మానసికంగా కుదేలవుతున్నారు. కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవడం అదనపు ఆర్థిక భారమవుతోంది.
అప్రమత్తమైన రైతులు
ఇక ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో ట్రాన్స్‌పార్మర్ చోరీలతో పాటు బోరు బావుల వద్ద మోటార్లు ఎత్తుకెళ్లడం, స్టార్టర్ పెట్టెలు, కేబుల్‌లు, డ్రిప్ పరికరాలు సైతం ఎత్తుకెళ్లడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పోలీసులకు రైతులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు తమ పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను కాపాడుకునేందుకు రైతులే ఉద్యమించారు. వంతుల వారీగా పొలాల కాపలా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ అపహరించేందుకు వచ్చిన అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన దొంగలను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అలాగే ప్రసన్నాయపల్లి వద్ద రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగిస్తున్న బిహార్ ముఠా సభ్యులను సకాలంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్ల విధ్వంసంతో కుదేలవుతున్న రైతులు
కాపర్ వైర్, ఆయిల్ అపహరించి గుజరీలో అమ్ముతున్న దొంగలు
కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అందేలోపు పంట నష్టపోతున్న అన్నదాతలు


