కారు బోల్తా.. బెంగళూరు వాసులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. బెంగళూరు వాసులకు గాయాలు

Feb 22 2026 7:05 AM | Updated on Feb 22 2026 7:05 AM

కారు

కారు బోల్తా.. బెంగళూరు వాసులకు గాయాలు

బత్తలపల్లి: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో బెంగళూరు వాసులకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... బెంగుళూరుకు చెందిన ప్రసాద్‌, తన భార్య నీరజ, కుమారుడు వశిష్టతో కలిసి కారులో కదిరి లక్ష్మీనరసింహస్వామికి దర్శనం ముగించుకున్న అనంతరం శుక్రవారం తిరుగు ప్రయాణమై అనంతపురంలోని సమీప బంధువుల ఇంటికి బయలుదేరారు. బత్తలపల్లి మండలం జ్వాలాపురం క్రాస్‌ దాటిన తరువాత కారు డ్రైవింగ్‌ చేస్తున్న ప్రసాద్‌ గుండెల్లో నొప్పి అంటూ బాధపడుతూ కారును ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఘటనలో గాయపడిన ముగ్గురినీ అటుగా వెళుతున్న వారు గమనించి హైవే అంబులెన్స్‌ ద్వారా ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు.

ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొని...

బత్తలపల్లి: మండలంలోని వెంకటగారిపల్లి క్రాస్‌ వద్ద శనివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మద్దలచెరువు గ్రామానికి చెందిన శివశంకర్‌ ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతూ వెంకగారిపల్లి క్రాస్‌ వద్దకు చేరుకోగానే బత్తలపల్లికి చెందిన తిరుపాలు ద్విచక్ర వాహనంపై వస్తూ ఎదురు పడ్డాడు. ఇద్దరూ రోడ్డు క్రాస్‌ చేసే క్రమంలో వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఇరువురూ ఒకరి తప్పు ఒకరు ఒప్పుకుని కేసులు లేకుండా రాజీ అయ్యారు. కాగా, ఘటనపై పోలీసులు ఆరా తీశారు.

వృద్ధురాలి ఆత్మహత్య

మడకశిర రూరల్‌: మండలంలోని పత్తికుంట గ్రామానికి చెందిన నాగరత్నమ్మ (62) ఆత్మహత్య చేసుకుంది. భర్త, ఓ కుమారుడు ఉన్నారు. పావగడలో కంటి ఆపరేషన్‌ చేసుకున్న అనంతరం కంటి నొప్పి ఎక్కువగా ఉండడంతో తరచూ మాత్రలు వేసుకునేది. ఈ క్రమంలో భరించలేని కడుపు నొప్పి మొదలు కావడంతో కుటుంబసభ్యులు చికిత్స చేయించారు. అయినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త హనుమంతరాయప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కోడి గెదిరిందని కొట్టుకున్నారు!

ముదిగుబ్బ: గ్రామంలోని ఇరు కుటుంబాల మధ్య ఓ కోడి చిచ్చు రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీఐ శివరాముడు తెలిపిన మేరకు... ముదిగుబ్బ మండలం సిద్దనగారిపల్లిలో నివాసముంటున్న నారాయణస్వామికి చెందిన పెంపుడు కోడి... అక్కడికి సమీపంలోనే ఉన్న చిన్న గంగులు ఇంటి ఎదుట గెదిరింది. ఈ విషయంగా వివాదం చెలరేగడంతో ఇద్దరూ గొడవపడ్డారు. శనివారం మరో సారి గొడవ పడి పరస్పరం కొట్టుకున్నారు. ఘటనలో నారాయణస్వామి, హరి గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిన్న గంగులు, గణేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కారు బోల్తా..  బెంగళూరు వాసులకు గాయాలు 1
1/1

కారు బోల్తా.. బెంగళూరు వాసులకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement