ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి
పుట్టపర్తి టౌన్: అత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని దివ్యాంగులకు డీఈఓ కిష్టప్ప సూచించారు. కొత్తచెరువు జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా స్థాయి దివ్యాంగులు ఆర్ట్స్, సాంస్కృతిక పోటీలు రెండు రోజుల పాటు జరిగాయి. 32 మండలాల నుంచి 200మంది దివ్యాంగ విద్యార్థులు హాజరయ్యారు. శనివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేసి, మాట్లాడారు. పోటీల్లో ప్రత్యేక అవసరాల గల పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, సహిత విద్యా సమన్వయకర్త డాక్టర్ పుల్లన్న, ఫిజియోథెరపిస్ట్‌లు పాల్గొన్నారు.
కారు ఢీకొని యువకుడి మృతి
పెనుకొండ రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం కొనతట్టుపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్(29). అమ్మవారిపల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గుట్టూరు వై జంక్షన్‌లోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్‌లో భోజనం పార్శిల్ కట్టించుకుని తన ద్విచక్ర వాహనం వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో అనంతపురం వైపు నుంచి శర వేగంగా దూసుకొచ్చిన కారు ముందు ఉన్న టాటాఏస్ వాహనాన్ని ఢీ కొని.. అదే వేగంతో ద్విచక్ర వాహనం వద్ద ఉన్న సాయికుమార్‌నూ ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను స్థానికులు వెంటనే పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు కియా పీఎస్ ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
‘డాష్ బోర్డు’ లోపాల దిద్దుబాటుకు చర్యలు
అనంతపురం క్రైం: డ్రైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డ్యాష్ బోర్డులోని లోపాలను సరిదిద్దుకునే చర్యలను సంబంధిత అధికారులు చేపట్టారు. డ్యాష్ బోర్డులో నమోదువుతున్న యూఎల్‌బీ హాజరు గణాంకాల ఆధారంగా శానిటేషన్ విభాగంలోని కార్మికులకు వేతనాలు మంజూరవుతూ ఉంటాయి. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలోని శానిటేషన్ విభాగంలో మొత్తం సిబ్బంది పనుల్లో పాలు పంచుకుంటుండగా హాజరు నమోదులో మాత్రం 0 శాతం నమోదైంది. ఈ అంశాన్ని ‘తప్పుల తడకగా డ్యాస్ బోర్డు’ శీర్షికన ఈ నెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు స్పందించి మంగళగిరిలోని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం ఆరు సర్కిళ్లు ఉండగా, 645 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజూ విధుల్లో పాల్గొంటున్నారని, సాంకేతిక లోపాల కారణంగా ఆన్‌లైన్ హాజరు నమోదులో జాప్యం చోటు చేసుకున్నట్లుగా అక్కడి అధికారులు అంగీకరించారు. ఈ లోపాన్ని సరి చేస్తున్నట్లు వివరించారు.
రేపటి నుంచి
ఇంటర్ వార్షిక పరీక్షలు
● రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వమూ సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమై మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి. కేంద్రాల్లో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, రెండు ఫ్లయింగ్‌స్వాడ్ బృందాలు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయింది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను ఆర్‌ఐఓ కార్యాలయంతో పాటు గుంటూరులోని ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేశారు.
స్టోరేజ్ పాయింట్లకు చేరిన ప్రశ్నపత్రాలు
ఇప్పటికే జిల్లా కేంద్రానికి మూడు సెట్ల ప్రశ్నపత్నాలు రాగా వాటిని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. అక్కడి నుంచి మండల పాయింట్లు (స్టోరేజ్ పాయింట్ల)కు తరలించారు. పోలీస్‌స్టేషన్ల నుంచి పరీక్షల ప్రారంభానికి ముందు అక్కడి నుంచి కేంద్రాలకు తరలించనున్నారు.
నేడే పరీక్ష కేంద్రాలను చూసుకోండి
పరీక్షలు ప్రారంభమయ్యే తొలిరోజు కేంద్రాల చిరునామాల కోసం గందరగోళ పడకుండా ముందురోజే (ఆదివారం) పరీక్ష కేంద్రాలను చూసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులను అధికారులు కోరుతున్నారు. పరీక్ష రోజు విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకునేలా ప్లానింగ్ చేసుకోవాలని చెబుతున్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళనలు చెందకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి
ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి


