అగ్రి ల్యాబ్‌ను పునఃప్రారంభిస్తాం
ఎరువులు, విత్తనాలు, పురుగు
మందుల నాణ్యతను పరీక్షించడం..
మట్టి పరీక్షలతో భూసార నివేదికలు అందిస్తూ సాగులో రైతుకు తోడుగా నిలిచిన అగ్రిల్యాబ్‌లు అటకెక్కాయి. వ్యవసాయం
దండుగ అంటూ తరచూ చెప్పే చంద్రబాబు.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలిగించే అగ్రి ల్యాబ్‌లను మూసివేయించారు. దీంతో కనీసం భూసార పరీక్షలు చేయించుకోలేని రైతులు
ఏ పంట వేయాలో తెలియక సతమతమవుతున్నారు.
కొత్తచెరువులో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్
పుట్టపర్తి అర్బన్: రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో రైతు వేసే ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. సంక్షేమ పథకాలతో పాటు రైతులకు కావాల్సినవి సమకూర్చారు. రైతు భరోసా కేంద్రాలతో ముంగిళ్లలోనే విత్తనాలు, ఎరువులు అందించారు. అలాగే నకిలీ విత్తనాలు, పురుగుమందులతో రైతులు నష్టపోకుండా చూడటంతో పాటు భూసారం ఆధారంగా రైతులు పంటలు సాగుచేసుకునేందుకు వీలుగా మట్టి పరీక్షలు నిర్వహించేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. అందులో విత్తనాలు, ఎరువుల నాణ్యత, మట్టి నమూనాలు పరీక్షించి నివేదికలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ శాఖతో పాటు, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలను ఇక్కడ ఉచితంగా నిర్వహించేవారు.
ఒక్కో భవనం రూ.80 లక్షలు..
డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లకు శాశ్వత భవనాలు నిర్మించారు. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ. 80 లక్షలు ఖర్చు చేశారు. జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు, ధర్మవరం, హిందూపురం, మడకశిర, కదిరి, పెనుకొండ నియోజక వర్గాల్లో వీటిని నిర్మించారు. మొత్తం 6 భవనాలను రూ.4.80 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. దీంతో ఆయా అగ్రిల్యాబ్‌లలో వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన అధికారులు, కోఆర్డినేటర్లు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. రైతులకు పంపిణీ చేసే విత్తనాల నాణ్యత, మొలక, తేమ శాతం పరీక్షించడం, ఎరువులు, ఆక్వా సీడు, ఫీడు నాణ్యతను నిర్ధారించేవారు. అగ్రిల్యాబ్ పరీక్షల్లో నాణ్యత నిర్ధారించిన తర్వాతే రైతులకు పంపిణీ చేసేవారు. ఏవైన నకిలీవి గుర్తిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేవారు. దీంతో రైతులు నకిలీల బారిన పడకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో సంతోషంగా వ్యవసాయం చేసేవారు.
మూడు ల్యాబ్‌లు నిరుపయోగం..
రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరాక వ్యవసాయ, అనుబంధ శాఖలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల పేరుమార్చి సిబ్బందిని కుదించిన చంద్రబాబు సర్కార్... అగ్రిల్యాబ్‌లను ఏకంగా మూత వేసింది. ఈ క్రమంలో జిల్లాలో నిర్మించిన 6 అగ్రి ల్యాబ్‌లలో పుట్టపర్తి, కదిరి, పెనుకొండ, హిందూపురంలోని అగ్రిల్యాబ్‌లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. రెండేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో కొత్తచెరువు అగ్రిల్యాబ్ మందుబాబులకు నిలయంగా మారింది. ల్యాబ్ చుట్టూ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆవరణలో అడుగు పెట్టడానికి కూడా వీలులేకుండా ఉంది. ప్రధాన ద్వారం దెబ్బతింది. ధర్మవరం, మడకశిరలోని అగ్రి ల్యాబ్‌లు మాత్రం కాస్తో కూస్తో పని చేస్తున్నాయి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు..
అగ్రిల్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో భూసార పరీక్షలు చేయించుకోలేని రైతులు ఏ పంట వేయాలో తెలియక సతమతమవుతున్నారు. అలాగే మార్కెట్‌లో నకిలీ విత్తనాలు, పురుగుమందులు వెల్లువెత్తగా రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ అగ్రిల్యాబ్‌లను మళ్లీ రైతులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో
అగ్రిల్యాబ్‌ల ఏర్పాటు
జిల్లాలో రూ.4.80 కోట్లతో 6 ల్యాబ్‌లు
భూసారం మొదలు విత్తన, ఎరువుల నాణ్యతలో పక్కాగా రిపోర్టులు
సాగులో రైతుకు ఎంతో మేలు చేసిన పరీక్ష కేంద్రాలు
నేడు రెండు మినహా తక్కినవన్నీ
నిరుపయోగం
కొత్తచెరువు అగ్రి ల్యాబ్ భవనాన్ని పరిశీలించి పునఃప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. అక్కడ ఉన్న వ్యవసాయాధికారిని ల్యాబ్‌లోనే విధులు నిర్వర్తించేలా ఆదేశిస్తాం. భవనాన్ని శుభ్రపరిచి వెంటనే వినియోగంలోకి తీసుకొస్తాం.
– కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి
అగ్రి ల్యాబ్‌ను పునఃప్రారంభిస్తాం
అగ్రి ల్యాబ్‌ను పునఃప్రారంభిస్తాం
అగ్రి ల్యాబ్‌ను పునఃప్రారంభిస్తాం


