రైతుల నోట్లో మట్టి కొట్టకు సవిత
పెనుకొండ (గోరంట్ల): ‘‘టీడీపీ నేతలు అధికారం అండతో అడ్డగోలుగా సహజ వనరులన్నీ దోచేస్తున్నారు. చివరకు చెరువులనూ చెరబట్టారు. టీడీపీ నేతల ధన దాహంతో గోరంట్ల పెద్దచెరువు భారీ గోతులతో రూపురేఖలు కోల్పోయింది. దీనివల్ల ప్రజలకు తాగునీటితో పాటు రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తనుంది. కేవలం మంత్రి సవిత అండచూసుకునే టీడీపీ నేతలు బరితెగించారు. ఇప్పటికై నా మంత్రి సవిత కళ్లు తెరవాలి. రైతుల నోట్లో మట్టి కొట్టే పనులు మానుకోవాలి’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. టీడీపీ నేతల మట్టి దందాతో రూపురేఖలు కోల్పోయిన గోరంట్ల పెద్దచెరువు వద్ద బుధవారం ఉషశ్రీచరణ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఆందోళన నిర్వహించారు. మట్టి తరలింపును నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ సంపద సృష్టించుకోమని చంద్రబాబు మీకు చెప్పారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. నియోజకవర్గంలో మంత్రి సవిత అక్రమాలకు అడ్డ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రతి గ్రామంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న సవిత మాఫియా భారీగా అక్రమ సంపాదనకు తెరలేపారన్నారు. ఈ విషయాన్ని స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారులేరన్నారు. ఆధారాలతో సహా ప్రజలు చేస్తున్న విజ్ఞప్తిని పట్టించుకోని అధికారులు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడక తప్పదన్నారు. అధికారులు తగిన చర్యలు చేపట్టని పక్షంలో త్వరలో రైతులతో కలసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గోరంట్ల తహసీల్దార్ మారుతిప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, వైఎస్సార్ సీపీ నాయకులు మేదర శంకర, పగడాల వెంకటేష్, రాజారెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
గోరంట్ల పెద్దచెరువులో మట్టితవ్వకాలపై ఆగ్రహం
వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి
చెరువు వద్ద ఆందోళన
రైతుల నోట్లో మట్టి కొట్టకు సవిత


