కియా పరిశ్రమకు అరుదైన గౌరవం
పెనుకొండ రూరల్: ‘కియా’ పరిశ్రమకు అరుదైన గౌరవం దక్కింది. వరుసగా రెండో సారి ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫికెట్ లభించింది. బుధవారం కియా పరిశ్రమలో జరిగిన కార్యక్రమంలో కియా మేనేజింగ్ డైరెక్టర్ గ్వాంగులీకి ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సంస్థ నిర్వాహకుడు బల్బీర్ సింగ్ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ సందర్బంగా గ్వాంగులీ మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల అంకిత భావం, నూతన అవకాశాలు కల్పించడం, పనిచేసేందుకు అనువైన వసతులు కల్పించినందుకు గాను ‘గ్రేట్ ప్లేస్ టూ వర్క్’ సర్టిఫికెట్ లభించిందన్నారు. వరుసగా రెండో ఏడాది సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సంస్థ నిర్వాహకుడు బల్బీర్ సింగ్ మాట్లాడుతూ... కియా పరిశ్రమలో ఉద్యోగులతో చేసిన సర్వే ఫలితం ఆధారంగా సర్టిఫికెట్ అందజేశామన్నారు. పరిశ్రమలో ఉద్యోగులకు వసతుల కల్పన, నూతన ఉద్యోగాల కల్పన, విధుల పట్ల ఉద్యోగుల అంకిత భావం తదితర అంశాలను బేరీజు వేసి సర్టిఫికెట్ అందించామన్నారు. కార్యక్రమంలో కియా పరిశ్రమ యాజమాన్యం, ఉద్యోగులు పాల్గొన్నారు.
వరుసగా రెండో ఏడాది
‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫికెట్ కై వసం


