హెల్మెట్ ఉంటేనే వాహనానికి పెట్రోలు
ప్రశాంతి నిలయం: ప్రమాదాలు అరికట్టి, ప్రాణనష్టం తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని, అందులో భాగంగా ఫిబ్రవరి నుంచి ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరించి ఉంటేనే బండికి పెట్రోలు పట్టేలా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... రహదారి భద్రతా చర్యల కోసం రూ.10.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఎన్‌హెచ్–44 నుంచి రూ.1.4 కోట్లు, ఎన్‌హెచ్–42 నుంచి రూ. 9.2 కోట్లు, కియా పరిశ్రమ సీఎస్సార్ ఫండ్ నుంచి రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదాలను అరికట్టేందుకు ‘స్టాప్ వాష్ అండ్ మూవ్’ను కొనసాగించాలన్నారు. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు నగదు రహిత చికిత్స అందించాలని డీఎంహెచ్‌ఓకు ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఐరాడ్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. రహదారి ప్రమాదాలను పూర్తిగా తగ్గించి ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులతో పాటు వాహన దారులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్టీఓ అధికారులు, ఆర్డీఓలు, డీఎస్పీలు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
ప్రమాద నివారణ చర్యలకు రూ.10.9 కోట్లు
రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్


