కంది రైతులకు ఇబ్బందులు కలగొద్దు
● అధికారులకు జేసీ ఆదేశం
రొద్దం: ఖరీఫ్‌లో కంది సాగుచేసిన రైతులు ఇబ్బందులు పడకుండా పంటను కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్యభ భరద్వాజ్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని బూచెర్ల పంచాయతీ రాగిమేకులపల్లిలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కందుల కొనుగోలుపై ఆరా తీశారు. కందుల నాణ్యత, కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రం వద్ద ఉన్న రైతులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. జేసీ వెంట పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, ఏడీఏ కృష్ణమీనన్, మార్క్‌ఫెడ్ డీఎం గీతాకుమారి, తహసీల్దార్ ఉదయశంకర్‌రాజు, ఏఈ రాజేష్, పలు శాఖల అధికారులు ఉన్నారు.
కంది కొనుగోలు కేంద్రాల పరిశీలన
ముదిగుబ్బ: మండల పరిధిలోని రాళ్లనంతపురం, మల్లేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య పరిశీలించారు. అదే విధంగా మల్లేపల్లి గ్రామ పొలాల్లో జరుగుతున్న ఈ–పంట నమోదును ఆయన పరిశీలించారు. రబీలో పంటలను సాగు చేసిన రైతులు తప్పకుండా ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలన్నారు. అలాగే మలకవేమలలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. డీలర్లు సక్రమంగా బిల్లు బుక్కులు, స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలన్నారు.
పిచ్చికుక్క దాడి..
పది మందికి గాయాలు
చెన్నేకొత్తపల్లి: ఓ పిచ్చికుక్క బుధవారం చెన్నేకొత్తపల్లిలో స్వైర విహారం చేసింది. కనిపించిన వారిపైనంతా దాడి చేసి గాయపరిచింది. పిచ్చికుక్కదాడిలో చెన్నేకొత్తపల్లికి చెందిన రామాంజనేయులు, కాశీరెడ్డి, గణేష్, వీరజిన్నయ్య, కమలకుమార్‌రెడ్డి, రమేష్, రామాంజనేయులు, నరసింహులు, నారాయణమ్మ తదితరులతో పాటు ముష్టికోవెల, కురబవాండ్లపల్లి గ్రామాలకు చెందిన వారు గాయపడ్డారు. మరికొందరు పిచ్చికుక్క దాడి నుంచి తప్పించుకున్నారు. అప్రమత్తమైన స్థానిక యువకులు పిచ్చికుక్క కొట్టి చంపినట్లు తెలుస్తోంది. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారంతా చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు.
కంది రైతులకు ఇబ్బందులు కలగొద్దు


