పారిశ్రామికాభివృద్ధికి చర్యలు
ప్రశాంతి నిలయం: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందువల్లే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సింగిల్‌డెస్క్ విధానం ద్వారా వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాల గురించి వివరించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు 15 కంపెనీల యాజమాన్యాలు ముందుకు వచ్చాయన్నారు. రూ.6175 కోట్ల పెట్టుబడులతో స్థాపించనున్న ఆయా పరిశ్రమల్లో 13,426 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. అనంతరం జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన వారితో గూగుల్ మీట్ ద్వారా చర్చించారు. పరిశ్రమల ఏర్పాటుకు త్వరిత గతిన భూమి పూజ చేసి వెంటనే పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లాలో అమలవుతున్న ఆర్‌ఏఎంపీ అవగాహన కార్యక్రమాలను, కేంద్రం ద్వారా అమలవుతున్న పీఎంఈజీపీ, విశ్వకర్మ కార్యక్రమాలను సమీక్షించారు. పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను అగ్నిమాక, పరిశ్రమల శాఖ ఉద్యోగులు, పొల్యూషన్ బోర్డు అధికారులు తరచూ పరిశీలన చేసి కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. అనంతరం ఇండసీ్ట్రయల్ డెవలప్‌మెంట్ పాలసీ కింద 16 యూనిట్లకు పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, అమ్మకపుపన్ను రాయితీలు మంజూరుకు అనుమతి ఇచ్చారన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్, జిల్లా నైపుణ్యాఽభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు
త్వరితగతిన అనుమతులు
డీఐఈపీసీ సమీక్ష సమావేశంలో
కలెక్టర్ శ్యాంప్రసాద్


