ఎక్సైజ్ ఎస్‌ఐగా గౌతమి గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ
గ్రూప్–2 ఫలితాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు అర్హత
పట్టుదలతో సాధించిన చిరుద్యోగులు అదే స్థాయిలో రాణించిన నిరుద్యోగులు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్–2 పరీక్షల్లో గ్రామీణ యువత మెరుగైన ఫలితాలు సాధించింది. ఫలితాలు బుధవారం విడుదల కాగా, పరిశీలించుకున్న పలువురిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. పట్టుదలతో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని దక్కించుకున్న చిరుద్యోగులు కొందరైత్.. అదే స్థాయిలో నిరుద్యోగులు సైతం రాణించారు. లక్ష్య సాధనలో విజయకేతనం ఎగురవేసిన అభ్యర్థులను గ్రామస్తులు అభినందలతో ముంచెత్తారు.
కార్యదర్శి నుంచి ఎక్సైజ్ అధికారిగా..
ఓడీచెరువు: మండలంలోని శేషయ్యగారిపల్లికి చెందిన నరేష్‌రెడ్డి భార్య గౌతమి గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ చాటి ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె కదిరి మండలం ఎగువపల్లి పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. నల్లమాడ మండలం గోపేపల్లికి చెందిన తల్లిదండ్రులు సోమశేఖరరెడ్డి, ప్రభావతమ్మ వ్యవసాయ పనులతో ఆమెను చదివించారు.
ప్రతిభ చాటిన ఉపాధ్యాయుడు

చిలమత్తూరు: మండలంలోని ఆరుమాకులపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న చంద్రమౌళి గ్రూప్–2 లో ప్రతిభ కనబరిచి జూనియర్ అసిస్టెంట్ (స్టేట్ పోస్ట్)గా ఎంపికయ్యారు. ఓ వైపు ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూనే మరో వైపు పట్టుదలతో పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉత్తీర్ణత సాధించిన చంద్రమౌళిని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
లక్ష్యం నిర్దేశించుకుని..
నల్లమాడ: గ్రూప్ 1 ఉత్తీర్ణతను లక్ష్యంగా నిర్దేశించుకున్న నల్లమాడ మండలం కుటాలపల్లి తండాకు చెందిన ఇస్లావత్ జయరాంనాయక్, బోడికమ్మ దంపతుల మూడో కుమారుడు నారాయణ నాయక్ గ్రూప్–2లో ప్రతిభ చాటి ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ప్రాథమిక చదువు మొదలు పీజీ వరకూ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లోనే చదువుకున్నారు. మొదట గ్రూప్ డీలో ఉత్తీర్ణత సాధించి రైల్వేలో ఉద్యోగం దక్కించుకున్నారు. అనంతరం 2018లో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నల్లమాడ మండలంలోని వేళ్లమద్ది పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ తన లక్ష్యానికి చేరువైన నారాయణనాయక్‌ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
మెరిసిన బావ, బావమరిది
అనంతపురం ఎడ్యుకేషన్: గోరంట్ల మండలం బీటీ తండాకు చెందిన ఎస్.శివప్రసాద్‌నాయక్ 2014 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు. 2021లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం రాయదుర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు. ఈయన తల్లి ప్రమీల, తండ్రి లక్ష్మీరామ్‌నాయక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలే. గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ చాటిన శివప్రసాద్‌నాయక్ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇక శివప్రసాద్ నాయక్ చెల్లెలును పెళ్లి చేసుకున్న రాయదుర్గం మండలం మల్లాపురం తండాకు చెందిన ఎస్.గంగాధర్ నాయక్ సైతం ప్రస్తుతం రాయదుర్గం ఫైర్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే గ్రూప్–2లో ప్రతిభ చాటి ఎకై ్సజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతని తల్లిదండ్రులు జయాబాయి, శంకర్‌నాయక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలే కావడం గమనార్హం.
సత్తాచాటిన రైతు బిడ్డ
తలుపుల: మండలంలోని పెన్నబడివాండ్లపల్లికి చెందిన రైతు పెన్నబడి శ్రీదర్‌రెడ్డి కుమార్తె పి.శ్రీవాణి గ్రూప్–2 ఫలితాల్లో సెక్రటరియేట్ ఏఎస్‌ఓగా ఎంపికయ్యారు. సామాన్య రైతు బిడ్డగా పుట్టిన ఆమె తన తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత శ్రేణి ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు అభినందించారు.
పట్టుదలే ఆలంబనగా..
ధర్మవరం రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న సాయి మనోహర్ భార్య అపర్ణ గ్రూప్ – 2 ఫలితాల్లో సత్తా చాటి ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఆమె పట్టుదలతో గ్రూప్–2కు సన్నద్ధమై విజయం సాధించడంతో బంధువులు, మిత్రులు అభినందనలతో ముంచెత్తారు.
సచివాలయ ఉద్యోగికి ఉన్నత కొలువు
ధర్మవరం అర్బన్: బత్తలపల్లి మండలానికి చెందిన షేక్ చాంద్‌బాషా, గౌసియాబేగం దంపతుల ఒక్కగానొక్క కుమారుడు షేక్ దాదాపీర్ గత వైఎస్సార్‌సీపీ హయాంలో ధర్మవరం మున్సిపాలిటీలో 12వ వార్డు సచివాలయ అడ్మిన్‌గా ఉద్యోగాన్ని సాధించారు. అప్పటి నుంచి ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు రాత్రి, తెల్లవారుజామున గ్రూప్–2 పరీక్షలకు సన్నద్దమవుతూ వచ్చారు. ఈ క్రమంలో గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగం జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అర్హత సాధించారు. విషయం తెలుసుకున్న ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, రాష్ట్ర స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల అధ్యక్షుడు షేక్ మహబూబ్‌బాషా, తోటి ఉద్యోగులు దాదాపీర్‌ను అభినందించారు.
స్తోమతకు మించి..
కురుమామిడి గ్రామానికి చెందిన యల్లటూరి శంకర, నరసమ్మ దంపతుల కుమారుడు వై.ఆంజనేయులు గ్రూప్–2 ఫలితాల్లో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. వ్యవసాయ కూలి పనులతో తల్లిదండ్రులు కష్టపడి కుమారుడిని బీఎస్సీ వరకు చదివించారు.
ఒకే ఇంట్లో ఇద్దరు..
కనగానపల్లి: మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి బుట్టా శివయ్య కుమారులు బుట్టా వేణుగోపాల్, ఓంప్రకాష్ గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ చాటి గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు సాధించారు. బుట్టా వేణుగోపాల్ వ్యవసాయశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. ఓం ప్రకాష్ సైతం రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఏఎస్‌ఓగా ఎంపికయ్యారు. ప్రతిభ చాటిన అన్నదమ్ములను గ్రామస్తులు అభినందించారు.
వ్యవసాయ కూలీ కొడుకు ఎస్‌ఐ అయ్యాడు!
నల్లచెరువు: మండలంలోని బాలేపల్లి తండా గ్రామానికి చెందిన వెంకటరమణ నాయక్, ప్రమీల దంపతుల కుమారుడు విజయ్‌కుమార్ నాయక్ గ్రూప్–2 ఫలితాల్లో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. పుట్టుకతోనే మూగవాడైన తండ్రి వెంకటరమణ నాయక్ కూలి పనులకెళ్లి ఎంతో కష్టంతో చదివించాడు. తల్లిదండ్రుల కష్టం వృథా కానివ్వకుండా పట్టుదలతో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించిన విజయ్‌కుమార్ నాయక్‌ను తండా వాసులు అభినందించారు.
వ్యవసాయం చేస్తూనే..
తనకల్లు: మండలంలోని గోవిందువారిపల్లికి చెందిన శివరాం, సుబ్బమ్మ దంపతుల కుమారుడు గొనౌరీ కార్తీక్ గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ చాటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఏఎస్‌ఓ (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)గా ఎంపికయ్యారు. అనంతపురంలోని జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసిన అనంతరం తల్లిదండ్రులకు చేదోడుగా వ్యవసాయం చేస్తూ తల్లి సుబ్బమ్మ, బాబాయి కారుకూరి (మల్లి టైలర్స్), పిన్ని నాగరత్న ప్రోత్సాహంతో గ్రూప్–2కు సన్నద్ధమయ్యారు.

కార్తీక్‌కు కేక్ తినిపిస్తున్న కుటుంబసభ్యులు


